ఎన్నికలు నిర్వహించండి.. ఈసీకి మహారాష్ట్ర గవర్నర్ లేఖ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రేకు ప్రస్తుతం పదవీ ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం ఉద్దవ్‌ఠాక్రే ఏ సభలోను సభ్యుడిగా లేరు.. దీంతో ఎమ్మెల్సీ కోటా కింద ఎన్నిక కావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రస్తుతం కరోనా సంక్షోభం కారణంగా ఎన్నికల సంఘం దీనిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఉద్దవ్‌ఠాక్రే సీఎం పదవి ఉంటుందా ఊడుతుందా అన్న దానిపై టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఖాళీ అయిన 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారి కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. లాక్‌డౌన్‌ను అమలులో ఉన్న దృష్ట్యా కేంద్రం ఇచ్చిన సడలింపులతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. "కౌన్సిల్ స్థానాలకు ఎన్నికలు కొన్ని మార్గదర్శకాలతో నిర్వహించబడతాయి" అని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఉద్ధవ్ ఠాక్రే రాష్ట్ర ఉభయ సభల్లో సభ్యుడు కానందున, ఆయన 2020 మే 27 లోపు ఎన్నిక కావాలి. కరోనావైరస్ సంక్షోభం కారణంగా మహారాష్ట్రలో జరగనున్న తొమ్మిది స్థానాలకు జరగాల్సిన ఎన్నికల ప్రక్రియను ఎన్నికల సంఘం గతంలో నిలిపివేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com