గ్యాస్ లీకేజ్.. ఏపీకి కావాల్సిన సహాయ, సహకారాలను అందిస్తాం : కిషన్ రెడ్డి

విశాఖనగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ రసాయన పరిశ్రమలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీక్ అయ్యింది. లీక్ అయిన వాయువు 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది. ఈ ఘటనలో వందలాది మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో అధికంగా చిన్నారులే ఉన్నారు. రసాయన వాయువు ప్రభావంతో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వాయువును పీల్చిన వారు ఎక్కడికక్కడే కుప్పకూలిపోయారు. బాధితులంతా కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
గ్యాస్ లీకేజీలో చనిపోయిన మృతులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. దుర్ఘటన జరిగిన ప్రాంతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మురం చేయాల్సిందిగా ఆదేశించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించనున్నట్లు వెల్లడించారు. ఈ కష్ట సమయంలో రాష్ట్రానికి కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందించనున్నట్లు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com