జగదేకవీరుడు అతిలోకసుందరికి మూడు దశాబ్ధాలు

జగదేకవీరుడు అతిలోకసుందరికి మూడు దశాబ్ధాలు

అద్భుతాలు జరిగేటప్పుడు ఎవరూ ఊహించరు. ఊహించకపోతేనే అది అబ్బుర పరుస్తుంది. ఆ పై ఆ విషయాన్ని ఎన్నిసార్లు తలచుకున్నా అదే ఆనందం, అదే ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఎన్నో అనుభూతులను అజరామరంగా అందించిన చిత్రం జగదేకవీరుడు అతిలోక సుందరి. తెలుగు సినిమా చరిత్రలో సోషియో ఫాంటసీలు చాలానే వచ్చాయి. అన్నిట్లోకీ కాస్త భిన్నమైనదీ.. ఆ తర్వాత మరెవరూ ఆ జానర్ కు వెళ్లలేకపోయిదీ జగదేకవీరుడు అతిలోకసుందరి. మెగాస్టార్ ఛరిష్మా, శ్రీదేవి సమ్మోహనం, రాఘవేంద్రుడి దర్శకత్వ ప్రతిభ, విన్సెంట్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా మెస్మరైజింగ్ మ్యూజిక్ కలబోతగా ఇది మాస్టర్ పీస్ అయింది. ఈ మే 9కి ఈ మాస్టర్ పీస్ విడుదలై ముఫ్ఫైయేళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్ర విశేషాలను ఓ సారి తలచుకుందాం..

కథ.. ఏ సినిమాకైనా ఇదే ప్రధానం. ఒక్కోసారి ఎంతో కష్టపడి రాసుకున్న కథలు ఆకట్టుకోవు. మరికొన్ని సార్లు ఆశువుగా అనుకున్న లైన్ లు, కథగా మారిపోతుంటాయి. అలా వచ్చిన కథే ఈ జగదేకవీరుడు అతిలోకసుదరి. నిర్మాత అశ్వనీదత్ కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తి ఊహకు రూపమే ఈ సినిమా. ఆయన చెప్పిన చిన్న లైన్ ఆధారంగా ఆనాటి అగ్ర రచయితలంతా కలిసి కూర్చుని కూర్చిన కథనమే ఈ సమ్మోహన చిత్రం. ఈ కథ, కథనాలు రూపొందుతోన్న టైమ్ లో వాళ్లు ఏం ఊహించారో కానీ.. ఇది తెలుగు సినిమా చరిత్రలో ఓ క్లాసిక్ గా నిలిచిపోయింది.

జగదేకవీరుడు అతిలోకసుదరి కథ గురించి మాట్లాడే ముందు కాస్త వెనక్కి వెళదాం. అప్పట్లో జానపదాలు వచ్చాయి. సాంఘికాలు, పౌరాణికాలు అంటూ విడివిడిగా వచ్చాయి. కానీ సోషియో ఫాంటసీ పరచయం అయిన తర్వాత మన సినిమాలన్నీ ఆ జానర్ లో యమలోకానికి వెళ్లడమే పరమావధిగా మారాయి. అయినా ఆ జానర్ లో వచ్చిన సినిమాలూ సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ ట్రెండ్ కు బిగ్గెస్ట్ హిట్ గా బీజం వేసింది ఎన్టీవోడి యమగోల.

సోషియో ఫాంటసీ అనగానే యమలోకం అనే ట్రెండ్ ను బ్రేక్ చేసి యమహో నీ యమా యమా అనిపించింది జగదేకవీరుడు అతిలోకసుదరి. అంతకు ముందు భూలోకానికి వచ్చిన దేవకన్యలు ఉన్నా.. వారంతా వరాలిచ్చినవాళ్లు మాత్రమే. లేదంటే హీరో కూడా అదే లోకానికి సంబంధించినవాడు. కానీ ఈ మూవీ అందుకు పూర్తిగా భిన్నం. ఎంత భిన్నం అంటే అతి సామాన్యమైన మంచి మనసుకున్న కుర్రాడిని ఏకంగా ఇంద్రుడి కూతురే ప్రేమించేంతటి భిన్నం. మరి ఆ ఇంద్ర పుత్రిక ఈ లోకానికి ఎందుకు వచ్చింది. ఇతగాడిని ఎలా కలిసింది.

జగదేకవీరుడు అతిలోకసుదరి కథగా చూస్తే.. హంపి ప్రాంతంలో టూరిస్ట్ గైడ్ పనిచేస్తుంటాడు రాజు అనే అనాథ. తనలాగే ఎవరూ లేని మరికొందరు పిల్లలను చేరదీసి.. వారితో పాటు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అలాంటి టైమ్ లో ఓ చిన్న ప్రమాదం వల్ల తను పోషిస్తోన్న ఓ బాలిక కాలికి గాయం అవుతుంది. ఆ గాయం మానాలంటే.. హిమాలయ పర్వత సానువుల్లో దొరికే ఓ మూలిక తేవాలి అంటారు ఆయుర్వేద వైద్యులు. అత్యంత ప్రమాదకరం, సాహసోపేతమైన ఆ పనికి వెళతాడు రాజు.

హిమాలయాల్లో రాజు అనుకున్నది సాధిస్తాడు. అంతకు ముందే హిమగిరి సొగసులు చూడాలనే కోరికతో ఇంద్రుడి అనుమతితో కైలాస పర్వత సానువుల్లోకి వస్తుంది ఇంద్రజ. ఆ అందాలలోని మహోదయాలకు మనసు పారేసుకుని చెలికత్తెలతో కలిసి ఓ పాటేసుకుంటుంది. ఇటు రాజు కూడా ఆ అందాలు చూస్తూ తిరుగు ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో ఇంద్రజ ఉంగరం అక్కడ పడిపోతుంది. అది రాజుకు దొరుకుతుంది. తర్వాత ఎవరికి వారు సొంత ప్లేస్ కు వెళతారు. కానీ ఉంగరం లేని ఇంద్రజకు ఇంద్రలోకానికి ఎంట్రీ లేదంటాడు ఇంద్రుడు. ఇక్కడి నుంచే ఆ అతిలోక సుందరి మన జగదేకవీరుడుని వెదుక్కుంటూ వచ్చి.. ఉంగరం కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది.

జగదేకవీరుడు అతిలోక సుందరి కథగా చూస్తే ఇంతే. ఉంగరం పారేసుకున్న ఓ దేవకన్య. ఆ ఉంగరం కోసం వచ్చి అది దొరికిన ఓ మానవుడితో ప్రేమలో పడుతుంది. ఇంత సింపుల్ స్టోరీ లైన్ ను ఆబాలగోపాలం మెచ్చే ట్రీట్మెంట్ తో మన రచయితలు చేసిన కృషిని తన దర్శకత్వ మాయాజాలంతో పదిమెట్లు పైన నిలిపాడు రాఘవేంద్రరావు. ఇక ఈ చిన్న లైన్ ను అప్పటి టాప్ రైటర్స్ అయిన సత్యామూర్తి, యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాల,సత్యమూర్తి, విజయంద్ర ప్రసాద్, క్రేజీ మోహన్ లు కలిసి ఈ సినిమా కథకు ఓ రూపం తీసుకొచ్చారు. అలాగే మెగాస్టార్ సైతం స్టోరీ డిస్కషన్స్ లో కూర్చునేవాడట.

ఇంత చిన్న కథలో ఎన్ని ట్విస్ట్ లుంటాయని.. రాజు పనిచేస్తోన్న ఏరియాలో అందరినీ శాసించే ఓ లోకల్ రౌడీ. అందుకోసం కన్నడ ప్రభాకర్ ను తీసుకుని వెయిట్ పెంచారు. అతన్ని ఎదిరించిన రాజు వద్ద దివ్యశక్తులున్నాయని తెలుసుకున్న ఆ రౌడీ ఓ పెద్ద మాంత్రికుడుని సంప్రదించడంతో కథలో అనేక మలుపులు మొదలవుతాయి. మాంత్రికుడు మహాద్రష్టగా అమ్రిష్ పురిని ఎంచుకోవాలన్నది ఎవరి ఆలోచనో కానీ ఆయన సినిమాకు పెద్ద ఎస్సెట్ అయ్యాడంటే అతిశయోక్తి కాదు. పైగా తనే డబ్బింగ్ చెప్పుకుని వైవిధ్యమైన డిక్షన్ తో ఆ పాత్రకు ఓ భయనకాన్ని ఆపాదించాడు అమ్రిష్ పురిగారు.

సీరియస్ నెస్ కనిపించినా ఎక్కడా ఎంటర్టైన్మెంట్ మిస్ కాకుండా చూసుకోవడమే ఈ సినిమా బిగ్ సక్సెస్ కు ఓ రీజన్. ముఖ్యంగా మానవా మానవా అంటూ శ్రీదేవి.. చిరంజీవి వెంటపడుతూ ఉంటే అతనేమో ఆమెను నాటకాల అమ్మాయి అనుకుని తింగరబుచ్చి అని ఏడిపించడం.. పిల్లలు కారుతో చేసిన ప్రమాదంలో అతను ఆమెను కొట్టడం.. ఆ తప్పు తమదే అంటూ పిల్లలు చెప్పాక.. రాజు.. ఇంద్రజకు సారీ చెప్పడం.. ఆ తర్వాత వచ్చిన అబ్బనీ తీయనీ దెబ్బ పాట వరకూ అదంతా మనల్ని మరో లోకంలోకి తీసుకువెళ్లే గొప్ప కథనం.

మాంత్రికుడికి ఇంద్రజ దేవకన్య అని తెలిసిన తర్వాత సీన్ మొత్తం మారిపోతుంది. అప్పటి వరకూ మంత్రగాడిని ఉంగరం సాయంతో ఎదుర్కొన్నా.. రాజు నిజంగానే జగదేకవీరుడు అనిపించేందుకు ఆ ఉంగరం లేకుండానే మాంత్రికుడని ఎదిరించే సీన్ కు విజిల్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోయాయంతే.. ఇక చిరంజీవి తనతో ఉన్నది తింగరబుచ్చి కాదు నిజంగానే ఇంద్రపుత్రిక అని తెలుసుకున్న తర్వాత మళ్లీ కథ సెంటిమెంట్ కు వెళ్లడం.. చివరగా అంతా ఊహించినట్టుగానే ఆమె ఇంద్రలోకాన్ని వదిలి ఓ గొప్ప వ్యక్తిత్వం ఉన్న రాజుకోసం మానవకన్యగా మారిపోవడంతో కథ సుఖాంతం అవుతుంది.

జగదేకవీరుడు అతిలోకసుందరి ఓ నవరసాల సమ్మేళనం. ఈ పార్ట్ అతిగా ఉంది. ఈ పార్ట్ మితిగా ఉంది అనేందుకు ఏ మాత్రం ఆస్కారం లేని కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్. సోషియో ఫాంటసీ సినిమాలకు ఇంతటి కలర్ ను అద్దిన రాఘవేంద్రరావు ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక ఈ కథ అనుకున్నప్పుడు కూడా ప్రధానపాత్రల్లో మెగాస్టార్, శ్రీదేవి తప్ప మరో నటుడు మదిలో మెదలలేదట. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరూ మరెవరినీ ఊహించుకునేందుకు ఛాన్స్ ఇవ్వలేదు. ముఖ్యంగా సినిమాలో శ్రీదేవికి కనిపించే కాస్ట్యూమ్స్ అన్నీ తనే స్వయంగా కుట్టించుకుందట. అలాగే చిరంజీవి రఫ్ లుక్ ఐడియా తనదే.

మెగాస్టార్ కు మాస్ రోల్స్ కొత్త కాదు. అప్పటికే వరుస విజయాలతో సుప్రీమ్ హీరో నుంచి మెగాస్టార్ గా ఎదుగుతున్నారు. పైగా రాఘవేంద్రరావుతో కాంబినేషన్ అంటే సూపర్ హిట్ గ్యారెంటీ. అప్పటికే టాప్ ప్రొడ్యూసర్ గా వెలుగుతోన్న అశ్వనీదత్ నిర్మించిన ఈ మూవీ విడుదల టైమ్ కు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు, వరదలు, తుఫాన్ తో అంతా అల్లకల్లోలంగా ఉంది. ఆ తుఫాన్ ఈ సినిమా సునామీ విజయానికి అడ్డుపడకపోవడం విశేషం. ఇలాంటి సందర్భమే 1971లో విడుదలైన ప్రేమ్ నగర్ కూ ఎదురైంది. ఆ సినిమా కూడా అఖండ విజయం సాధించడం విశేషం. ఇక ఆ రోజుల్లో దాదాపు రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఏకంగా 11కోట్లకు పైనే రాబట్టింది. అంటే నేటి బాహుబలి కంటే ఎక్కువే రాబట్టింది.

ఇక ఈ సినిమాలో కనిపించే పిల్లల్లో బేబీ షాలినితో పాటు నేటి అజిత్ భార్య షామిలీ కూడా ఉంది. అలాగే వీరి సోదరుడు మాస్టర్ రుషి కూడా ఆ టీమ్ లో ఉండటం విశేషం. ముఖ్యంగా బేబీ షాలినీపాత్ర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవిని పాత్ర పేరు పెట్టే రాజూ రాజూ అంటూ పిల్లలంతా పిలుస్తుంటారు. అలాగే ఇంద్రజను అక్కా అంటుంటారు. ఇక చిరంజీవికి యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలంతా కలిసి ఆంజనేయ స్వామినీ ప్రార్థిస్తూ పాడే జై చిరంజీవా పాట ఓ మార్క్ లా నిలిచిపోయింది.

ఈ సినిమా విడుదలకు ముందే విజయాన్ని ఖాయం చేసింది ఇళయరాజా సంగీతం. ప్రతి పాటా ఓ ఆణిముత్యమే. అయితే అప్పటి వరకూ మెగాస్టార్ సినిమాల్లో ఒకటో రెండో మెలోడీ పాటలు, మిగతా అన్నీ మాస్ సాంగ్స్ ఉండేవి. కానీ ఈ మూవీలో అన్ని పాటలూ మెలోడీనే కావడం విశేషం. చిత్రంలోని అన్ని పాటలూ వేటూరి రాశారు. యమహో నీయమా యమా అనే పాట ఆల్రెడీ తమిళ్ లోని ట్యూన్ నే తెలుగులో వాడాడు రాజా. అలాగే నేపథ్య సంగీతం సినిమా ఆయువుపట్టులా నిలిచింది. అయితే ఎన్ని చెప్పినా ఈ మూవీలోని పాటలు టైమ్ లెస్ మెలోడీస్ అనే చెప్పాలి.

రాఘవేంద్రరావు ఆస్థాన సినిమాటోగ్రాఫర్ అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేవలోకం నుంచి హిమాలయాల్లోని ఒరిజినల్ ప్లేస్ లలో చిత్రీకరించిన సన్నివేశాలు, ప్రియతమా అనే పాటలోని లైటింగ్ ఏది చూసినా ఓ అద్భుతం అన్నట్టుగా చిత్రీకరించారు విన్సెంట్. రాఘవేంద్రరావుతో ఉన్న సింక్ వల్లే ఇలాంటి ఓ కలర్ ఫుల్ సినిమా సాధ్యమైనంది అనుకోవచ్చు. సెట్స్, ఆర్ట్ వర్క్, ఎడిటింగ్, యాక్షన్.. ఇలా ముందే చెప్పినట్టుగా అన్నీ ది బెస్ట్ గా నిలిచి ఈ సినిమాను మరో ముఫ్ఫైయేళ్లైనా మర్చిపోలేం అన్నట్టుగా మార్చాయి.

జగదేకవీరుడు అతిలోకసుందరిలో మరో ఎస్సెట్ ఆర్టిస్ట్స్. అన్ని పాత్రలకూ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్స్ ను తీసుకున్నారు. విలన్స్ పాత్రల్లో మహాద్రష్టగా అమ్రిష్ పురి, కన్నడ ప్రభాకర్, రామిరెడ్డి, తనికెళ్ల భరణి, అల్లు రామలింగయ్యతో పాటు పోలీస్ పాత్రల్లో నటించిన జనగరాజ్, ఆర్ఎస్ మాలోకం కూడా ఆకట్టుకున్నారు. ఈ పోలీస్ క్యారెక్టర్స్ ఇద్దరూ తమిళ్ ఆర్టిస్ట్స్ కావడం విశేషం.

ఎలా చూసినా జగదేకవీరుడు అతిలోకసుందరి మాస్ క్లాస్ అన్న క్లాసిఫికేషన్ లేని క్లాసికల్ మాసివ్ హిట్. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను సమపాళ్లలో మెప్పించిన రేర్ మూవీ ఇది. ఇతర హీరోల హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం విరగబడి చూసిన సినిమా. ఇలాంటి సినిమా మా హీరో ఒక్కటైనా చేయాలి అనిపించిన సినిమా. ఈ సినిమా నుంచి అశ్వనీదత్ కూడా మెగా ప్రొడ్యూసర్ అయిపోవడం విశేషం.

చివరగా .. ఈ సినిమా విడుదలైన తర్వాత నుంచి వినిపిస్తోన్న మాట దీనికి సీక్వెల్ ఉంటుందని.. ఇప్పుడు చిరంజీవి చేయలేడు. కానీ ఆయన తనయుడు ఉన్నాడు. శ్రీదేవి ఆల్రెడీ తన లోకానికి వెళ్లిపోయింది. ఆమె కూతురుంది. కానీ లెక్కకుదరదు. అయినా ఇప్పుడు అతిలోక సుందరి అంటే శ్రీదేవి స్థాయి ఉన్న నటిని ఊహించలేం. మళ్లీ మెగాస్టార్ రేంజ్ లో చరణ్ మెస్మరైజ్ చేస్తాడా అనేదీ చెప్పలేం. కానీ చిరంజీవి మాటల్లోనే చెబితే.. ఏ అద్భుతమూ ప్లాన్ చేస్తే జరగదు. అది అలా అయిపోతుందంతే. మరి ఈ సారి కూడా అలా కావాలని.. వీలైనంత త్వరగా మనకు మరో కొత్త జగదేకవీరుడు అతిలోకసుందరి రావాలని కోరుకుందాం..

మూప్పై ఏళ్లు పూరైన సందర్భంగా జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాపై స్పెషల్ స్టోరీ

- బాబురావు. కామళ్ల

సీనియర్ సబ్ ఎడిటర్

Tags

Read MoreRead Less
Next Story