ఎల్జీ పాలిమర్స్.. ప్రాణాలు తీసిన 'స్టైరిన్'

ఎల్జీ పాలిమర్స్.. ప్రాణాలు తీసిన స్టైరిన్

విశాఖ ప్రజల్ని నిద్ర లేపే సమద్రపు చల్లని గాలులు, ఆరోజు విషవాయువుల్ని మోసుకొచ్చింది. నిద్రలోనే కొందరి ఊపిరి తీసింది. వందల మందిని ఆస్పత్రి పాల్జేసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఓ పెద్ద పరిశ్రమ ఎల్జీ పాలిమర్స్. పరిశ్రమలో నిల్వచేసిన అత్యంత విషపూరితమైన 'స్టైరిన్ మోనోమర్' ద్రవ రూపంలో ఉంటే ఎంత ప్రమాదమో,, అదే గ్యాస్‌గా మారితే అంతకంటే ఎక్కువ ప్రమాదం. లీకైన స్టైరిన్ గ్యాస్ గాలిలో కలిసి ఆ చుట్టు పక్కల నివసిస్తున్న వారికి ఊపిరి ఆడనివ్వకుండా చేసింది. కొందరిని మృత్యువొడికి చేర్చింది. మరి కొందరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

కొరియన్ కంపెనీ ఎల్‌జీ.. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, వాషింగ్ మెషిన్లు ఉత్పత్తి చేస్తుంది. వీటి తయారీకి కావలసిన ఫ్రేమ్‌లు, ఇతర విడిభాగాల తయారీ ఇక్కడ జరుగుతుంది. ఇందుకోసం విదేశాల నుంచి భారీగా స్టైరిన్ అనే రసాయనాన్ని దిగుమతి చేసుకుని ఫ్యాక్టరీలోని భారీ ట్యాంకుల్లో నిల్వ వుంచుతుంది. ఈ ట్యాంకర్ల వద్ద ఎప్పుడూ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూడాలి. అప్పుడే ఆవిరిగా మారకుండా ద్రవ రూపంలో ఉంటుంది. లాకడౌన్ కారణంగా పరిశ్రమ గత 45 రోజులుగా మూతపడి ఉంది. బుధవారం నుంచి పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేసింది యాజమాన్యం. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగి 1800 టన్నులు నిల్వ ఉన్న స్టైరిన్ ఆవిరిగా మారింది. గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమంలో గ్యాస్ ట్యాంక్ వద్ద ఉన్న చిమ్నీలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విషవాయువు లీకైంది. క్షణాల్లో ఈ విషవాయువు గాల్లో కలిసి పరిశ్రమను ఆనుకుని ఉన్న వెంకటాపురం, ఆర్ఆర్ వెంకటాపురం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది.

Tags

Read MoreRead Less
Next Story