గ్యాంగ్ లీడర్ @30 ఇయర్స్

గ్యాంగ్ లీడర్ @30 ఇయర్స్
X

వెండితెరపైకి ఎన్నో సినిమాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఎన్నేళ్లైనా ప్రేక్షకుల మదిలో అద్భుతంగా నిలిచిపోయే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి సినిమానే గ్యాంగ్ లీడర్. చిరంజీవిని మాస్ హీరోగా మరో స్టేజ్ కి తీసుకెళ్లి మెగాస్టార్ కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన గ్యాంగ్ లీడర్ 30వ సంవత్సరంలో అడుగుపెట్టింది. చిరంజీవి ఫుల్ పీక్స్ లో ఉన్న టైం. కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి హిట్స్ తో బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్నాడు. సెంచరి కొట్టాక మరింత జోష్ తో పరుగులు పెడుతున్నాడు. ఆ టైంలోనే వచ్చిన కంప్లీట్ కమర్షియల్ మూవీ గ్యాంగ్ లీడర్. విజయబాపినీడు దర్శకత్వంలో తెరకెక్కి 1991 మే 9న విడుదలైన గ్యాంగ్ లీడర్ సంచలన విజయం సాధించి మెగాస్టార్ పవర్ ని చూపించింది.

ఇప్పుడు సినిమాలని మాస్ ఎంటర్టైనర్ అని, కుటుంబకథా చిత్రమని, మల్టీప్లెక్స్ మూవీ అని డివైడ్ చేస్తున్నారు. కానీ గ్యాంగ్ లీడర్ మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సూపర్ హిట్ అయ్యింది. మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రివేంజ్, లవ్ ట్రాక్, కామెడీ అన్నింటి కలయికతో ఫుల్ మీల్స్ లా ప్రేక్షకుల ముందుకొచ్చింది గ్యాంగ్ లీడర్. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరినీ అలరించి సూపర్ హిట్ అయ్యింది. రఘుపతి,రాఘవ,రాజారాం అనే ముగ్గురు అన్నాదమ్ముల కథాంశంతో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి కెరీర్ లోనే ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. మురళీ మోహన్, శరత్ కుమార్ చిరుకు అన్నయ్యలుగా నటించిన ఈసినిమాలో మెగాస్టార్ లోని మాస్ హీరో చెలరేగిపోయాడు. చెయ్యి చూశావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తానని చిరు డైలాగ్ చెబితే ధియేటర్లు మోతెక్కిపోయాయి. బాక్సాఫీస్ దిమ్మ తిరిగిపోయింది.

ఈసినిమాలో చిరంజీవి మేనరిజమ్స్ కి ఓ రేంజ్ లో విజిల్స్ పడ్డాయి. చిరు ప్రతీ మేనరిజమ్ ని అప్పటి కుర్రాళ్లంతా అడాప్ట్ చేసుకుని, చిన్నపాటి మెగాస్టార్ లా బిహేవ్ చేసేవారు. చిరు హెయిర్ స్టయిల్, ఫేడెడ్ జీన్స్, ఫుల్ లెంగ్త్ షర్ట్స్ ఇలా అన్నింటిని ఫాలో అయిపోయారు. గ్యాంగ్ లీడర్ కి తమ్ముళ్లలా మారిపోయారు. అంతలా జనాలకు ఎక్కేసింది గ్యాంగ్ లీడర్. అందుకే 30కి పైగా సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుని ఇప్పటికీ ఎప్పటికీ మాస్ మూవీస్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచింది ఈ సినిమా. గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ అయ్యి మెగాస్టార్ కి మాస్ లో స్ట్రాంగ్ బేస్ ఏర్పడ్డంలో ఈసినిమా లీడర్ విజయబాపినీడుదే మేజర్ రోల్. హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం, రాజారాంని ఆవారా నుంచి రెస్పాన్సిబుల్ బ్రదర్ గా మార్చే సన్నివేశాలు, ఫ్యామిలీ డ్రామా అన్నింటిని కలిపి విజయబాపినీడు పర్ఫెక్ట్ ప్యాకేజ్ గా మలిచిన తీరు గ్యాంగ్ లీడర్ ని సూపర్ హిట్ సినిమాగా తీర్చిదిద్దింది.

విజయబాపినీడు గ్యాంగ్ లీడర్ సినిమాని తెరకెక్కించిన విధానం ఇప్పటికీ చాలా మంది దర్శకులకు ఓ కమర్షియల్ సినీ పాఠమే. రఘుపతి రాఘవ రాజారాం అని ముగ్గురు అన్నదమ్ములతో దేశభక్తి, ఆ అన్నదమ్ముల కథలో ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఏకాంబరం,కనకాంబరం వల్ల చిన్నాభిన్నం అయ్యే ఫ్యామిలీ, అన్నని చంపిన వాళ్లపై పగ తీర్చుకోవడానికి రాజారాం చేసే పోరాటం అన్నీ కలిపి ఓ ప్యాకేజ్ గా తెరకెక్కించిన విధానం టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఫ్యామిలీ స్టోరీలో మాస్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసి సినిమాలు తియ్యడం గ్యాంగ్ లీడర్ నుంచే స్టార్ట్ అయ్యింది. ఏసినిమాలో అయినా హీరోయిజం ఎలివేట్ కావాలంటే పవర్ ఫుల్ విలన్ ఉండాలి. ఇందులోనూ చిరంజీవికి పోటీగా ఏకాంబరం, కనకాంబరంగా రావుగోపాల్ రావు, ఆనంద్ రాజ్ లు క్రూరమైన విలన్స్ గా నటించారు. తమకు అడ్డొచ్చిన వాళ్లను అన్యాయంగా చంపేసే రౌడీ సోదరులు ఓ హత్య కేసులో సాక్షిగా ఉన్న మురళీ మోహన్ ని దారుణంగా చంపేస్తారు. ఈ హత్యని చూసిన చిరంజీవి స్నేహితులను మర్డర్ చేస్తారు ఏకాంబరం కనకాంబరం. అన్నయ్యని, ఫ్రెండ్స్ ని చంపిన రాక్షస సోదరులపై ప్రతీకారం తీర్చుకోవడం గ్యాంగ్ లీడర్ స్టోరీ.

ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఈ సినిమాకే హైలెట్. ఎస్పీకి చిరంజీవికి మధ్య జరిగే సంభాషణ తర్వాత చిరు గోడను బద్దలు కొట్టడం ఆ బ్లాస్ట్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ పడ్డం ఇప్పటికీ మార్వలెస్ అంటారు సినీజనాలు. ఇక ఈ సినిమా నుంచే ఇంటర్వెల్ కు ముందు ఫైట్ సీన్స్ రావడం, ఆ తర్వాత ట్విస్టులు వచ్చి యాడ్ అవ్వడం అన్నీ స్టార్ట్ అయ్యాయని చెబుతారు. అంతలా టాలీవుడ్ దర్శకులపై ప్రభావం చూపించింది గ్యాంగ్ లీడర్ సినిమా. గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్ లో బప్పి లహరి సంగీతం, పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్, ప్రభుదేవా కొరియోగ్రఫీకి మేజర్ షేర్ దక్కుతుంది. బప్పీ పెప్పీ ట్యూన్స్ కి చిరు చేత ప్రభుదేవా బ్రేక్ డాన్సులు చేయించి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాడు. సినిమా ఎవర్ గ్రీన్ హిట్ గా నిలవడంలో, చిరు రేంజ్ పెరగడంలో తమ వంతు పాత్ర పోషించారు.

గ్యాంగ్ లీడర్ సినిమా అనగానే మ్యాజికల్ మాస్ హిట్ తో పాటు మ్యూజికల్ ధండర్ కూడా గుర్తొస్తుంది. ఈసినిమాకు బప్పి లహరి ఇచ్చిన పాటలు ఇప్పటికీ డాన్సులు చేయిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయితే సినిమా సక్సెస్ లో కీరోల్ ప్లే చేసింది. ఇక బప్పీ లహరి అందించిన హుషారైన పాటలకు, తన కొరియోగ్రఫీతో చిరంజీవి లోని ఫెంటాస్టిక్ డాన్సర్ ని మరోసారి ప్రేక్షకులకు పరిచయం చేశాడు ప్రభుదేవా. ఈ డాన్సులు కూడా చిరుకి యూత్ ఫాలోయింగ్ పెరగడానికి దోహదపడ్డాయి. ఈసినిమా పాటల్లో ముఖ్యంగా చెప్పుకోవల్సింది వానా వానా వెళ్లువాయే పాట గురించి. చిరంజీవి, విజయశాంతి కాంబినేషన్లో మోస్ట్ రొమాంటిక్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాట వానపాటల ట్రెండ్ ని పీక్స్ కి తీసుకెళ్లింది. హీరో హీరోయిన్లు మధ్య కెమిస్ట్రీ అంటే ఇలా ఉండాలంటూ చిరు,విజయ శాంతి చేసిన ఆ వాన పాట ఇప్పటి కుర్రాళ్లకు కూడా గిలిగింతలు పెడుతుంది. అందుకే రామ్ చరణ్ కూడా ఈ పాటను రీమిక్స్ చేసి రచ్చ చేశాడు. అయితే మెగాఅభిమానులు మాత్రం ఈ రీమిక్స్ లో చెర్రీ చిరుని బీట్ చెయ్యలేదంటారు.

గ్యాంగ్ లీడర్ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవల్సింది పరుచూరి బ్రదర్స్ రాసిన డైలాగ్స్. రఫ్ ఆడిస్తా అంటూ చిరుతో, రావు గాపాలరావుతో ఓసి నీ తస్వరవ్వాల బుడ్డి లాంటి డైలాగ్స్ అయితే అప్పటి తరానికి ఊతపదాలైపోయాయి. అయితే క్యాచీ డైలాగ్సే కాదు హార్ట్ టచింగ్ సెన్సిబుల్ డైలాగ్స్ కూడా ప్రేక్షకులని టచ్ చేశాయి. శరత్ కుమార్ సుమలత మాట విని సుధని అనుమానించే సీన్ లో రాముడు సీతని అనుమానించాడు గానీ లక్ష్మణుడు అనుమానించలేదురా అని చిరు చెప్పే డైలాగ్ అద్భుతం. ఇలాంటి బోల్డన్ని మాటలు తూటాల్లా పేలాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో ఏ ఒక్క ఎలిమెంట్ మిస్ కాలేదు. రివేంజ్ ఫ్యామిలీ డ్రామాలోనూ కామెడీకి కొదవ లేదు. కామెడీ ట్రాకులంటూ సినిమాతో సంబందం లేని గొడవలా కాకుండా, నిర్మలమ్మ-చిరంజీవి మధ్య శబరి సీన్, విజయశాంతి-చిరు మధ్య వచ్యే ఫన్నీ సన్నివేశాలు పక్కా పైసా వసూల్ సినిమాకు కావాల్సిన హంగుల్లో ఒకటిగా నిలిచి, కామెడీ ట్రాక్ ని నడిపించాయి. ఇవేకాదు ఈసినిమాలోని అల్లు రామలింగయ్య,కైకాల సత్యనారాయణ,నూతనప్రసాద్,జయలలిత ఇలా ప్రతీ ఒక్కరూ సినిమా సక్సెస్ లో బాగం పంచుకున్నారు.

గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబందించిన ప్రతీ విషయం ట్రెండ్ సెట్టింగే. సినిమా మేకింగ్ నుంచి విజయోత్సవ సభ వరకు అన్నీ టాలీవుడ్ లో ప్రత్యేకతను సంపాదించుకున్నాయి. ఇతర సినిమాలు కూడా గ్యాంగ్ లీడర్ విజయోత్సవ సభను వాడుకునేంత పాపులారిటీ తెచ్చుకుందీ సినిమా. పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమా 30కి పైగా సెంటర్స్ లో హండ్రెడ్ డేస్ కి పైగా ఆడింది. ఈ విజయాన్ని భారీ విజయోత్సవ సభలతో నిర్వహించింది చిత్ర యూనిట్. మే9న రిలీజ్ అయిన ఈసినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ని నాలుగు ప్రాంతాలు హైద్రాబాద్,విజయవాడ,తిరుపతి,ఏలూరులో ఒకే రోజు నిర్వహించారు.దీనికోసం ప్రత్యేకంగా హెలికాఫ్టర్ ని కూడా వాడారు.

ఈ హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ని ఈవివి సత్యనారాయణ తన అప్పుల అప్పారావు సినిమాలో వాడుకున్నాడు. గ్యాంగ్ లీడర్ సినిమా యూనిట్ కి తెలియకుండానే అన్నపూర్ణని తీసుకెళ్లి శతదినోత్సవ వేడుకని షూట్ చేసుకొచ్చాడు. దీనివల్ల చిరు అన్నపూర్ణని అపార్దం చేసుకున్నా, అప్పారావుకు మాత్రం గ్యాంగ్ లీడర్ చాలా ప్లస్ అయ్యింది. గ్యాంగ్ లీడర్ సినిమా తెలుగులో సూపర్ హిట్ కావడంతో హిందీలోనూ పున:నిర్మించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఆజ్ కా గూండా రాజ్ గా తెరకెక్కిన ఈసినిమాలో చిరంజీవితో మీనాక్షి శేషాద్రి జోడీ కట్టింది. అయితే హిందీ వెర్షన్ కి బప్పి లహరి కాకుండా ఆనంద్ మిలంద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. బాలీవుడ్ లో కూడా ఈసినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఇక కన్నడలో ఉపేంద్ర ఈసినిమాని కుటుంబగా రీమేక్ చేసి సక్సెస్ కొట్టాడు. అంతలా భాషా బేధం లేకుండా అడుగుపెట్టిన ప్రతీ వుడ్ లోనూ హిట్ కొట్టి బాక్సాఫీస్ కి లీడర్ అనిపించుకున్నాడు మన గ్యాంగ్ లీడర్. మొత్తంగా చిరంజీవితో పాటు మెగా అభిమానులందరికీ గ్యాంగ్ లీడర్ ఓ మెమరబులో మూవీగా నిలిచిపోయింది.

ఉదయ్ కుమార్.డి

సీనియర్ సబ్ ఎడిటర్

Next Story

RELATED STORIES