రమేష్ కుమార్ వివాదంపై హైకోర్టులో వాద, ప్రతివాదనలు

రమేష్ కుమార్ వివాదంపై హైకోర్టులో వాద, ప్రతివాదనలు

ఏపీలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు, మాజీ ఎస్ఈసీ రమేష్ కుమార్ తొలగింపు కేసులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్.. ఆర్టికల్ 243కే ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవికి రక్షణ లేదన్నారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందంటూ.. గతంలో ఎస్ఈసీ అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఊదాహరణగా చూపించారు. ప్రభుత్వం తరపు వాదనల్లో అభ్యంతరాలపై పిటిషనర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు.

మాజీ ఎన్నికల కమిషనర్ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్ కేసులో గత మంగళవారం నాటికే 11 మంది పిటీషనర్ల వాదనలు పూర్తయ్యాయి. అయితే..విచారణ సందర్భంలో పలు ఆసక్తికర సందేహాలను లేవనెత్తింది హైకోర్టు ధర్మాసనం. ప్రభుత్వం పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని.. కానీ, మున్సిపల్ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేదు కదా అని ప్రశ్నించింది. అంటే మున్సిపల్ చట్టం ప్రకారం నిమ్మగడ్డ రమేస్ కుమార్ పదవీ ముగియనట్టే కదా అనే సందేహం వ్యక్తం చేసింది. ఒకే పదవీలో ఉండే వ్యక్తి పంచాయితీ రాజ్ చట్టం మేరకు మూడేళ్లు, మున్సిపల్ చట్టం మేరకు ఐదేళ్లు ఎలా పదవీలో ఉంటారని ప్రశ్నించింది.

ఇక ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా దాఖలైన 11 పిటీషన్లపై జంధ్యాల రవిశంకర్, వేదుల వెంకటరమణ, ఆదినారాయణరావు వంటి సీనియర్ న్యాయవాదులు ఇప్పటికే తమ వాదనలు వినిపించారు. కేవలం కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. ఆర్టికల్ 243కే ప్రకారం ఎస్ఈసీకి పదవీకి రాజ్యాంగ రక్షణ ఉంటుందని, పదవీకాలం ముగియకముందే తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ప్రతివాదనలు వినిపించిన ఏజీ.. ఆర్టికల్ 243కే ప్రకారం నిమ్మగడ్డ పదవీకి రక్షణ ఉండదని, అతని కక్షసాధింపు కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చారనే వాదనల్లో వాస్తవం లేదన్నారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించటం కోసమే ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు. అయితే..ఏజీ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం.. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నవారి పదవి కాలాన్ని తగ్గించిన సందర్భాలు ఏమైనా ఉంటే కోర్టు ముందుంచాలని పేర్కొంది. దీంతో నిన్నటి వాదనలకు కొనసాగింపుగా ఇవాళ కోర్టులో వాదనలు వినిపించిన ఏజీ..గతంలో ఎస్ఈసీ అంశాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story