విశాఖలో కొనసాగుతున్న నియంత్రణ చర్యలు

విశాఖలో కొనసాగుతున్న నియంత్రణ చర్యలు

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీక్‌ ఘటనలో విషవాయువు నియంత్రణ చర్యలు కొనసాగుతున్నాయి. గుజరాత్‌ నుంచి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం, ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ప్రమాదానికి కారణమైన స్టైరీన్ ట్యాంక్‌ లో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నియంత్రించటం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. స్టైరీన్‌ ట్యాంక్‌ లో టెంపరేచర్ ను 120 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి తీసుకొచ్చారు. టీబీసీ రసాయనం ద్వారా మరింత ఉష్ణోగ్రతను పూర్తిగా నియంత్రణలకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే గాలి స్వచ్ఛతను, సాంద్రతను తెలుసుకునేందుకు ఎల్జీ పాలిమర్స్ లో ప్రత్యేక యంత్రం ఏర్పాటు చేశారు.

స్టైరీన్‌ ట్యాంక్‌ నుంచి గ్యాస్‌ లీకేజీ తగ్గటంతో గాలిలో విష వాయువు ప్రభావం అంతగా ఉండదని చెబుతున్నారు అధికారులు. అంతేకాదు..ప్రస్తుతం గాలిలో తక్కువ మోతాదులోనే ఉందని, దానివల్ల ఇబ్బంది ఉండబోదని టెక్నికల్‌ బృందం తెలిపింది. అయినా..ఇప్పటికిప్పుడు పరిస్థితి చక్కబడే అవకాశాలు కనిపించటం లేదు. పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులోకి రావాలంటే ఎల్లుండి వరకు ఒపిక పట్టాల్సిందేనని చెబుతున్నారు మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి.. స్టైరీన్ గ్యాస్ ఉన్న ట్యాంక్ పరిస్థితిపై ఆరా తీశారు. గ్యాస్‌ లీక్‌ ప్రమాదం తర్వాత ఏపీలో 86 పెద్ద కంపెనీలను గుర్తించామని, ఆయా చోట్ల భద్రతా ప్రమాణాల్ని పరిశీలించాకే తిరిగి పనులు ప్రారంభించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గౌతంరెడ్డి తెలిపారు.

గ్యాస్‌ లీక్‌ ఘటనలో వెంకటాపురంతో పాటు ఐదు గ్రామాల్లో ఇంకా భయానక వాతావరణం నెలకొంది. మొన్నటి వరకు పచ్చని చెట్లు, పాడి-పంటతో నిక్షేపంలా కనిపించిన గ్రామాలు..ఇప్పుడు కళావిహినంగా మారిపోయాయి. జనం ఇళ్లు వదిలి వెళ్లిపోవటంతో వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. పచ్చని చెట్లన్ని మాడిపోయాయి. ఎటు చూసినా జంతు కళేబరాలు పడి ఉన్నాయి. మరోవైపు ప్రస్తుతానికి విష వాయువు ప్రభావం తగ్గినా.. ఎదో ఒక రూపంలో మరో దశాబ్దం వరకు ఆ ఆరు గ్రామాల ప్రజలపై స్టైరిన్‌ ప్రభావం ఉంటుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక గ్యాస్‌ లీక్‌ ఘటనలో అస్వస్థతకు గురైన వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ లో 200 మందికిపైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇందులో 40 మంది వెంటిలేటర్‌ పై ఉన్నారు. మరో 200 మంది ప్రైవేట్‌ ఆస్పత్రులు, పీసీహెచ్‌ లలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే..స్టైరీన్‌ అత్యంత ప్రమాదకరమైన రసాయనమని..చర్మానికి తాకిన దాని దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా..48 గంటల తర్వాత చేసే పరీక్షలే కీలకమంటున్నారు. బాధితుల రక్తంలో వాయువులను కలిసిన తీవ్రతను బట్టి వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు.

విశాఖపట్నం విషాదం తర్వాత స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. గుండెల మీద కుంపటిలా మారిన ఎల్జీ పాలిమర్స్‌ ను వెంటనే అక్కడి నుంచి తరలించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మా శవాల మీద పరిశ్రమలు నిర్మించుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ ప్రభుత్వాన్ని, అధికారుల్ని నిలదీస్తున్నారు.

ఎల్జీ పాలిమర్స్‌ విష వాయువు చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యవరణాన్ని నాశనం చేసేసింది. పీల్చే గాలే కాదు..తాగే నీరు కూడా కలుషితం కావొచ్చనే అనుమానలు ఉన్నాయి. దీంతో అప్రమత్తమై అధికారులు మేఘాద్రిగడ్డ నుంచి విశాఖకు తాగు నీటి సరఫరాను నిలిపివేశారు. స్టైరీన్‌ ప్రభావంతో నీరు కలుషితం అయ్యే అవకాశాలు ఉండటంతో నీటిని పరీక్షించిన తర్వాత తిరిగి సరఫరా ప్రారంభించాలని నిర్ణయించారు. అంతవరకూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

మరోవైపు గ్యాస్‌ లీక్‌ ప్రమాదంతో భయంతో వణికిపోతున్న విశాఖ సమీప గ్రామాల్లో అర్ధరాత్రి చెలరేగిన పుకార్లు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఘాటు వాసనలు రావటంతో మళ్లీ గ్యాస్ లీక్‌ అవుతోందంటూ ప్రచారం జరిగింది. దీంతో జనం ఉన్నఫళంగా ఇళ్లు వదిలి రోడ్ల మీద పరుగులు తీశారు. వేలాది మంది ఆర్కే బీచ్‌, కొత్తవలస, మధురవాడ, గాజువాక లాంటి సురక్షిత ప్రాంతాల్లోనే ఉండిపోయారు. రాత్రంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు. అయితే..గ్యాస్‌ లీక్‌ జరగలేదని అదంతా పుకార్లను తెలిసి మళ్లీ ఉదయం కంత మంది ఇళ్లకు చేరుకున్నారు. ఇంకొంత మంది మాత్రం తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక వెంకటాపురంతో పాటు 5 గ్రామాల ప్రజల కోసం సింహాచలంలోని సింహాచలంలోని కల్యాణమండపాలు, గోశాల, పాలిటెక్నిక్ కాలేజీ సహా పలుచోట్ల 10 పునరావాస కేంద్రాల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం 4 వేల మంది ఎల్జీపాలిమర్స్ బాధితులు సింహచలంలో తలదాచుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story