Top

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసిన గ్రామ సచివాలయ నిర్మాణ యత్నం

చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తతలకు దారి తీసిన గ్రామ సచివాలయ నిర్మాణ యత్నం
X

చిత్తూరు జిల్లాలో గ్రామ పంచాయతీ సచివాలయ నిర్మాణ యత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆ స్థలంలో సచివాలయం నిర్మించొద్దంటూ ఓ మహిళ ఏకంగా ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఈ ఘటన ఎస్‌ఆర్‌పురం మండలం సీకేపురం గ్రామం పరిధిలో చోటుచేసుకుంది. సీకేపురం గ్రామంలో సర్వే నెంబర్ 242లో 50 సెంట్ల భూమి ఉంది. ఇందులో 25 కుటుంబాలు పశువుల కోసం గుడిసెలు వేసుకున్నాయి. అదే స్థలంలో పశువుల మేతను పెంచుతున్నారు. కానీ ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు రెవెన్యూ అధికారులు. ఇదే స్థలంలో గ్రామ పంచాయతీ సచివాలయ భవనాన్ని నిర్మించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు.

పశువుల పాకలను తొలగించడానికి రెవెన్యూ అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. జేసీబీతో షెడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. కానీ స్థానికులు రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుకున్నారు. పశువుల పాకలను తొలగించవద్దని.. వాటిపై ఆధారపడి జీవిస్తున్న తమ పరిస్థితేంటని వాగ్వాదానికి దిగారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉన్న నేపథ్యంలో అధికారులు ఇలా రావడమేంటని స్థానికులు నిలదీశారు. అధికారులు, పోలీసుల తీరుపై ఆగ్రహించిన ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో అధికారులు వెనుదిరిగారు. అయితే అది ప్రభుత్వ స్థలమని.. అక్కడ గుడిసెలు వేయరాదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. ఒక వారం సమయం ఇస్తామని.. ఆ లోపు వాటిని తొలగించకపోతే తామే తొలగిస్తామని తహసీల్దార్ అన్నారు.

Next Story

RELATED STORIES