కరోనా రోగులపై ఫవిపిరవిర్ మెడిసిన్‌ ప్రయోగం

కరోనా రోగులపై ఫవిపిరవిర్ మెడిసిన్‌ ప్రయోగం
X

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. దాదాపు 70, 80 కంపెనీలు వ్యాక్సిన్ కోసం ప్రయత్నిస్తున్నాయి. కానీ అందరి దృష్టి మనదేశంపైనే ఉంది. వైరస్‌లను దీటుగా ఎదుర్కొన్న ఘనత మనదేశానికి ఉండడమే అందుకు కారణం. పైగా, వ్యాక్సిన్లు తయారు చేయడంలో మనదేశానికి మంచి పేరు ఉంది. బీసీజీ సహా రకరకాల వ్యాక్సిన్లు మనదేశంలో తయారయ్యాయి. ఇప్పుడు కరోనాకు కూడా మనదేశమే వ్యాక్సిన్ కనిపెడుతుందని ప్రపంచదేశాలు నమ్మకంతో ఉన్నాయి. ఆ నమ్మకాన్ని నిలబెట్టేదిశగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆ ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్నాయి. యాంటీ వైరల్ ఔషధంపై పరీక్షలు ఫైనల్ స్టేజ్‌కు చేరాయి.

ఫవిపిరవిర్.. ఇప్పుడు అందరి దృష్టి ఈ మెడిసిన్‌పైనే ఉంది. ఇది యాంటీ వైరల్ మెడిసిన్. కొవిడ్-19 చికిత్సలో ఈ ఔషధం సూపర్బ్‌గా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ మెడిసిన్ ప్రయోజనాలపై కొంతకాలంగా పరీక్షలు జరుగుతున్నాయి. తాజాగా క్లినికల్ ట్రయల్స్ కీలక దశకు చేరుకున్నాయి. మూడో దశలో భాగంగా ఫవిపిరవిర్ మెడిసిన్‌ను కొవిడ్-19 రోగులపై ప్రయోగించనున్నారు. గ్లెన్ మార్క్ కంపెనీ ఈ మెడిసిన్‌పై టెస్టులు చేస్తోంది. తాజాగా గ్లెన్‌మార్క్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు కూడా వచ్చాయి. ఫవిపిరవిర్‌కు కొవిడ్-19ను నయం చేసే కెపాసిటీ ఉందని గ్లెన్ మార్క్ అంటోంది. కరోనాను నియంత్రించే మెడిసిన్‌పై మూడో దశ పరీక్షలు జరుపుతున్న తొలి కంపెనీ తమదే అని గ్లెన్‌మార్క్ పేర్కొంది.

ఫవిపిరవిర్‌ విషయానికి వస్తే జపాన్‌లో టొయామా కెమికల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ గతంలో అవిగన్ అనే ఔషధాన్ని తయారు చేసింది. జపాన్‌లో ఇన్‌ఫ్లూయెంజా వ్యాధిగ్రస్తుల చికిత్స కోసం ఆ మెడిసిన్‌ను రూపొందించారు. అప్పట్లో ఆ ఔషధం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఆ అవిగన్‌ బ్రాండ్ మెడిసిన్‌కు జనరిక్ రూపమే ఫవిపిరవిర్‌. ఈ మెడిసిన్‌ను చైనా, దక్షిణ కొరియాల్లో కరోనా బాధితులపై టెస్ట్ చేసి చూశారు. ఫవిపిరవిర్‌తో కొవిడ్-19 బాధితులు త్వరగా కోలుకున్నట్లు ఫలితాలు వచ్చాయి. దాంతో మనదేశంలో ఆ మెడిసిన్‌పై టెస్టింగ్స్ మొదలయ్యాయి.

ప్రస్తుతం మనదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు కలిపి మొత్తం 10 సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయి. జులై లేదా ఆగస్టు నాటికి పరీక్షలు పూర్తయ్యే అవకాశముంది. మూడో దశలో రోగులపైనే ప్రయోగిస్తున్నారు. థర్డ్ స్టేజ్‌లో రోగుల చికిత్సకు 14 రోజులు, అధ్యయనం మొత్తం పూర్తవడానికి 28 రోజులు పడుతుంది. ఈ ప్రయోగాలు విజయవంతమైతే కొవిడ్-19 చికిత్సలో ముందడుగు పడినట్లే.

Next Story

RELATED STORIES