మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో ప్రధాని మోదీ భేటీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో భేటీ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కొవిడ్-19 పరిస్థితులపై బిల్ గేట్స్‌తో మోదీ చర్చించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవ డానికి అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలపై సమాలోచనలు జరిపారు. కరోనాపై పోరాటంలో భారతదేశ పాత్ర, ప్రపంచదేశాలు పరస్పరం సహకరించుకుంటూ పని చేయాల్సిన అవసరాన్ని వారిద్దరూ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా కట్టడికి పాటిస్తున్న చర్యలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను బిల్ గేట్స్‌కు మోదీ వివరించారు. ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భౌతిక దూరం పాటించడం, శుభ్రతకు ప్రాధాన్యమివ్వడం, మాస్కులు ధరించడం, నిబంధనలను పాటించడంలో ప్రజల భాగస్వామ్యం మాటల్లో చెప్పలేనిదన్నారు. అలాగే ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆయుర్వేదం ద్వారా ప్రజల్లో రోగనిరోధక శక్తి పెంచేలా అవగాహన కల్పించడం తదితర చర్యలు మహమ్మారిని పారదోలేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రశంసించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com