డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పట్ల సర్వత్ర ఆగ్రహం

డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పట్ల సర్వత్ర ఆగ్రహం

డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. డాక్టర్లకు మాస్కులు ఇవ్వటం లేదని ప్రశ్నించినందుకు ఇంతలా కక్ష సాధిస్తారా అంటూ ప్రభుత్వం తీరును తప్పుబడుతున్నారు. మెడికల్ అసోసియేషన్ తో పాటు.. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కులసంఘాలు డాక్టర్ సుధాకర్ కు బాసటగా నిలుస్తున్నాయి. ఓ బాధ్యతాయుతమైన డాక్టర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయంగా ఉందంటూ మండిపడ్డాయి. డాక్టర్ సుధాకర్ అరెస్ట్ కు నిరసనగా విశాఖ ఎల్ఐసీ జంక్షన్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పవిత్ర వృత్తిలో ఉన్న వైద్యుడికి ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వకుండా.. ఓ మృగాన్ని కట్టినట్టు కట్టి నడిరోడ్డుపై పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. దళిత సంఘాల ఆందోళనను పోలీసులు అడ్డుకోవటంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

పోలీసుల అరెస్ట్ తర్వాత డాక్టర్ సుధాకర్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం ఆయన్ని కేజీహెచ్ నుంచి మానసిక చికిత్సాలయానికి తరలించారు. డాక్టర్ సుధాకర్ మానసిక స్థితి సరిగ్గా లేదన్నది కేజీహెచ్ డాక్టర్ల అభిప్రాయం. అంతేకాదు.. ఆయన మద్యం మత్తులో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. కానీ, డాక్టర్ సుధాకర్ మాత్రం పోలీసులు, డాక్టర్ల ఆరోపణలను కొట్టిపారేశారు. మాస్కులు లేవని ప్రభుత్వాన్ని నిలదీసినందుకే తనను వేధిస్తున్నారని ఆయన చెబుతున్నారు. అంతేకాదు.. లోన్ కట్టేందుకు తీసుకెళ్లిన 10 లక్షలతో పాటు ఫోను, కారును కూడా పోలీసులు తీసుకెళ్లారని ఆరోపిస్తున్నారు. మద్యం తాగకముందే తాగినట్లు కట్టుకథ అల్లుతున్నారని ఆయన అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story