డాక్టర్‌ సుధాకర్‌పై దాడి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌

డాక్టర్‌ సుధాకర్‌పై దాడి.. కానిస్టేబుల్‌ సస్పెండ్‌

విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌పై జరిగిన దాడిని టీడీపీ నేతలు ఖండించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో చినవాల్తేరులోని మెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సుధాకర్‌ను నేతలు పరామర్శించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితతోపాటు పలువురు నేతలు సుధాకర్‌ను పరామర్శించారు. ప్రభుత్వ చర్య దుర్మార్గమని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అన్నారు.. ప్రపంచమంతా వైద్యులకు సన్మానాలు చేస్తుంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం డాక్టర్లపై పిచ్చివాళ్లనే ముద్ర వేస్తోందని ఫైరయ్యారు. సుధాకర్‌కు మద్దతుగా మాట్లాడితే చర్యలు తీసుకుంటారని రాష్ట్రంలో వైద్యులు భయపడుతున్నారని అన్నారు. సమాజం తప్పని చెబుతున్నా తాను చేసిందే కరెక్ట్‌ అని ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు.. ఒక మంచి వైద్యుడికి సపోర్ట్‌ ఇవ్వాల్సిన అవసరం ఉందని అయ్యన్నపాత్రుడు అన్నారు. సుధాకర్‌ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్‌ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై రాష్ట్రపతి, సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌, మానవ హక్కుల సంఘానికి తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత లేఖ రాశారు.. డాక్టర్‌ సుధాకర్‌ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని అనిత లేఖలో కోరారు. ప్రశ్నించిన పాపానికి పిచ్చివాడని ముద్ర వేస్తారంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కాలంలో వైద్యుడిపై ఇంత దాష్టీకమేంటని అనిత ప్రశ్నించారు.

ఇక డాక్టర్‌ సుధాకర్‌పై జరిగిన దాడిని తెలంగాణ మెడికల్‌ జేఏసీ ఖండించింది. డాక్టర్‌పై దాడిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.. డాక్టర్‌ సుధాకర్‌ తాగితే పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలి తప్ప.. ఈ తరహా కక్ష సాధింపు చర్యలేంటని వారు ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ చర్యలను వారంతా ముక్త కంఠంతో ఖండించారు. సుధాకర్‌ ఘటనపై పూర్తి విచారణ జరిపించాలని మెడికల్‌ జేఏసీ డిమాండ్‌ చేసింది.

అటు డాక్టర్‌ సుధాకర్‌పై జరిగిన దాడి ఘటనలో పోలీసు విచారణ కొనసాగుతోంది.. ఈ ఘటనలో ఇప్పటికే ఓ కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు.. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని.. సుధాకర్‌ను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తరలించాలని ఆయన తల్లి డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story