పెను తుఫాన్‌గా మారి తీరంవైపు దూసుకొస్తున్న ఆంఫన్‌

పెను తుఫాన్‌గా మారి తీరంవైపు దూసుకొస్తున్న ఆంఫన్‌
X

ఆంఫన్‌ తుఫాన్‌ తీరంవైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశాను ఆనుకుని.. పశ్చిమ బెంగాల్‌వైపు పెనుతుఫాన్‌ పయనిస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. బుధవారం మధ్యాహ్నం లేదా సాయంత్రం పశ్చిమ బెంగాల్‌లోని దిఘా-బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్య సుందర్‌బన్స్‌కు సమీపంలో తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. తీరందాటే సమయంలో గంటకు 155 నుంచి 185 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీయనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ తీరంపై ఆంఫన్‌ తన ప్రభావాన్ని చూపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. ఇక్కడ తీరం అల్ల కల్లోలంగా మారింది. రంగంపేట నుంచి ఎస్పీజీఎల్‌ శివారు వరకు సముద్రం ఎగిసిపడుతుంది. సముద్ర అలలు వాహనదారులపై విరుచుకు పడుతున్నాయి. దీంతో కాకినాడ ఉప్పాడ ప్రయాణించే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బీచ్‌ రోడ్డు మీదకు రాళ్లు వచ్చి పడుతున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతోంది.

అటు కోనసీమలోని తీర ప్రాంతంలోనూ అలజడి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది దగ్గర సముద్రం 50 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో మత్స్యకార గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సరుగుడు తోటలు సముద్రపు కోతకు గురయ్యాయి. లైట్‌హౌస్‌ వరకు సముద్రపు అలలు ముంచుకొస్తున్నాయి.రాజోలు నియోజకవర్గం అంతటా ఈదురుగాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి శివసాగర్‌ బీచ్‌లో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అలల కల్లోలం వల్ల సముద్రం 20 మీటర్ల మేర ముందుకు వచ్చింది.

Next Story

RELATED STORIES