రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఇచ్చిన ఎన్జీటీ

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్టే ఇచ్చిన ఎన్జీటీ

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ స్టే ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక వచ్చేవరకూ దీనిపై ముందుకు వెళ్లొద్దని ఆదేశించింది. పర్యావరణ ప్రభావంపై 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని, ఇందుకోసం KRMB, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, IIT హైదరాబాద్‌కు చెందిన సభ్యులతో కమిటీలో ఏర్పాటు చేయాలని సూచించింది. రాయలసీమ ఎత్తిపోతలపై NGTకి అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణ నేతృత్వంలోని బెంచ్‌.. ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడంతోపాటు, నీటి మళ్లింపు సామర్థ్యం పెంచేందుకు వీలుగా రాయలసీమ ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టాలని భావించిన ఏపీ ప్రభుత్వం ఇటీవలే జీవో నంబర్ 203ను జారీ చేసింది. 6 వేల 829 కోట్ల 15 లక్షల వ్యయానికి సంబంధించి పరిపాలన అనుమతులు సైతం మంజూరు చేసింది. త్వరలోనే టెండర్లు పిలిచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐతై.. ఈ పనులపై అభ్యంతరం చెప్తూ తెలంగాణ ఇప్పటికే KRMBని ఆశ్రయించింది. తాజాగా NGT కూడా స్టే ఇచ్చింది.

శ్రీశైలం నీటిని లిఫ్ట్ చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్టు పనులను ఏపీ ప్రభుత్వం మూడు భాగాలుగా విభజించింది. మొదటిది సంగమేశ్వరం నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తి శ్రీశైలం రైట్ మెయిన్‌ కెనాల్‌లో పోసేలా రాయలసీమ లిఫ్ట్ స్కీమ్‌ను చేపడతారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటరీ నుంచి దీని పొడవు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 3 వేల 825 కోట్లు. ఇక రెండోది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి బీఆర్‌సీ కాంప్లెక్స్ వరకు కాలువల ఆధునికీకరణ పనులు చేపడతారు. ఇందుకోసం ఏపీ సర్కారు 570 కోట్ల 45 లక్షల నిధులను కేటాయించింది. ఇక మూడోది ప్రస్తుత SRBC కాలువ లైనింగ్ ఆధునికీకరిస్తారు. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ పనులు తాము చేపడుతున్నట్టు ఏపీ ప్రభుత్వం చెప్తున్నా.. ఇది ఏకపక్ష నిర్ణయమని తెలంగాణ ప్రభుత్వం మండిపడుతోంది.

పునర్విభజన చట్టం ప్రకారం కొత్త ప్రాజెక్టుల విషయంలో ఎపెక్స్ కమిటి అనుమతి తీసుకోవాలని కానీ ఏపీ అలాంటి ప్రయత్నాలు చేయలేదని తెలంగాణ సర్కార్ అంటోంది. శ్రీశైలం రిజర్వాయర్ ఉమ్మడి ప్రాజెక్టు అయినందున ఏపీ సర్కారు కొత్త ఎత్తిపోతల నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని వాదిస్తోంది. పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీటి కష్టాలు ఏర్పడతాయయని చెప్తోంది. నీటి వాడకం విషయంలో ఇరు రాష్ట్రాలు తమ తమ వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలోనే .. ఈ జల వివాదం ఇప్పుడు NGTకి కూడా చేరింది. ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో 2 నెలల్లో కమిటీ అన్నింటిపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వనుంది.

Tags

Read MoreRead Less
Next Story