డాక్టర్ సుధాకర్ కేసు విచారణలో లిక్కర్ అమ్మకాలపై ఆసక్తికర వాదనలు

డాక్టర్ సుధాకర్ కేసు విచారణలో లిక్కర్ అమ్మకాలపై ఆసక్తికర వాదనలు

డాక్టర్ సుధాకర్ వాంగ్మూలాన్ని గురువారం హైకోర్టులో సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో విశాఖ సెషన్స్ జడ్జి శ్రీనివాసరెడ్డి బుధవారం సాయంత్రం ఆస్పత్రికి వెళ్లారు. 5 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 55 నిమిషాల వరకు డాక్టర్ సుధాకర్ తో మాట్లాడి అతన్నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఈ సమయంలో సుధాకర్ కుటుంబసభ్యులు, మీడియా సహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్యులను కూడా ఆ గదిలోకి అనుమతించలేదు. రికార్డ్ చేసిన వాంగ్మూలాన్ని గురువారం హైకోర్టుకు సమర్పించనున్నారు.

అంతకుముందు డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఓ డాక్టర్ ను రోడ్డుపై దొర్లిస్తారా? ఓ డాక్టర్ తో వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అంటూ ప్రశ్నించింది. అసలు సుధాకర్ పోలీసు కస్టడీలో ఉన్నారా? జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే...ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం డాక్టర్ సుధాకర్ ను కోర్టు హజరు పరుచాల్సి ఉంది. కానీ, ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సుధాకర్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా అతన్ని నేరుగా కోర్టులో హజరుపరుచలేమన్నారు. వీడియో కాన్ఫరెన్స్ కు అనుమతివ్వాలని కోరారు. చివరి సాంకేతిక కారణాలతో వీడియో కాన్ఫరెన్స్ కు కూడా అవకాశం లేకుండా పోయింది.

అయితే..ఈ వరుస పరిణామాలపై అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది పి. వీరారెడ్డి అనుమానాలు వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ ఒంటిపై గాయాలు మానే వరకు ఇలా జాప్యం చేయాలని పోలీసులు భావిస్తున్నట్లు ధర్మాసనానికి తన సందేహాం తెలిపారు. సుధాకర్ వద్దకు మెజిస్ట్రేట్ను పంపి గాయాలు పరిశీలించి వాంగ్మూలం నమోదు చేయించాలన్నారు. అమికస్ క్యూరీ అభ్యర్థన మేరకు మెజిస్ట్రేట్తో వాంగ్మూలం నమోదు చేయించాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను శుక్రవారంకి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం సాయంత్రమే విశాఖ 5వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ దగ్గరకు వెళ్లి వాంగ్మూలం రికార్డ్ చేశారు. గురువారం సాయంత్రానికల్లా వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పిస్తారు. సుధాకర్ వాంగ్మూలం ఆధారంగా శుక్రవారం విచారణ జరిగే ఆవకాశాలు ఉన్నాయి.

మరోవైపు డాక్టర్ సుధాకర్ కేసు విచారణలో లిక్కర్ అమ్మకాలపై ఆసక్తికర వాదనలు జరిగాయి. డాక్టర్ ను అరెస్ట్ చేసి, రోడ్డుపై దొర్లించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా వాదనలు వినిపించిన ప్రభుత్వ తరపు న్యాయవాది..సుధాకర్ అప్పటికే తప్పతాగి ఉన్నాడని, మద్యం మత్తులో రభస చేయటం వల్లే అదన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నాల్లో అలా జరిగి ఉండొచ్చన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. మద్యం తాగారని చేతులు వెనక్కి విరిచి తాళ్లతో కడతారా? మరి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యం షాపుల ముందు క్యూ లైన్లలో తోసుకున్న వారిని ఈ ప్రభుత్వం, పోలీసులు చోద్యం చూస్తున్నారని వ్యాఖ్యానించింది. కరోనా వ్యాప్తి సమయంలో మద్యం దుకాణాలు తెరిచి, ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అధిక ధరలకు మద్యం కొని మేమే దేశాన్ని నడిపిస్తున్నామని మద్యం ప్రియులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి?అని విస్మయం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story