అనూహ్య ఘటన.. వరదల ధాటికి కూలిపోయిన రెండు డ్యామ్‌లు

అనూహ్య ఘటన.. వరదల ధాటికి కూలిపోయిన రెండు డ్యామ్‌లు

భూకంపాలు, భయంకర గాలి దుమారాన్ని తట్టుకోవచ్చేమో గానీ జలప్రళయాన్ని తట్టుకోవడం మాత్రం అంత ఈజీ కాదు. క్షణాల్లోనే ఊళ్లకు ఊళ్లు ఊడ్చుకుపోతాయి. నిమిషాల్లోనే అంతా తల్లికిందులై పోతుంది. నీళ్లు లేని ప్రాంతాలు ఒక్కసారిగా భరించలేని నీటితో నిండిపోతాయి. అప్పటివరకు నీళ్లతో కళకళలాడిన ప్రాంతాల్లో అకస్మాత్తుగా నీటి చుక్క అన్నది కనిపించదు. సెంట్రల్ మిచిగన్‌లో అదే జరిగింది. చెరువుల్లో నీరంతా ఒకేసారి మాయమైంది. అప్పటివరకు నిండుగా నీళ్లతో కళకళలాడిన రెండు లేక్‌లు ఒక్కసారిగా బోసిపోయాయి. నీళ్లు లేక కళావిహీనంగా మారిపోయాయి.

సెంట్రల్ మిచిగన్‌లో రెండు డ్యామ్‌లు అకస్మాత్తుగా కూలిపోయాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. దాంతో వరద నీరు సమీప కాలనీలను ముంచెత్తింది. ఒక్కసారిగా నీళ్లు దూసుకురావడంతో మిచిగన్ పరిసర ప్రాంతాల నీట మునిగాయి. మిడ్‌ల్యాండ్ ప్రాంతంలో 9 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహించింది. వేలాది వాహనాలు నీట మునిగాయి. వందలాది ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.

విక్సమ్ లేక్ పరిసరాల్లో ఈడెన్ విల్లీ డ్యామ్ ఉంటుంది. శాన్‌ఫోర్డ్ డ్యామ్‌ను ఆనుకొని శాన్‌ ఫోర్డ్ డ్యామ్‌ను నిర్మించారు. ఆ రెండు సరస్సుల్లో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఆ నీటి ఉద్ధృతిని రెండు డ్యామ్‌లు తట్టుకోలేకపోయాయి. వరద వేగం అంతకంతకూ పెరగడంతో డ్యామ్‌లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆ ప్రభావం టిట్టాబావాస్సీ నదిపై పడింది. రెండు సరస్సుల నుంచి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తడంతో టిట్టాబావాస్సీ నది పొంగిపొర్లింది. టిట్టాబావాస్సీ నది పోటెత్తడంతో మిచిగన్ పరిసర ప్రాంతాలు అల్లాడిపోయాయి. ఈడెన్ విల్లీ, శాన్‌ఫోర్డ్, మిడ్ ల్యాండ్ ఏరియాలు పూర్తిగా నీట మునిగాయి.

1986 తర్వాత మిచిగన్‌లో ఈ స్థాయి వరదలు రావడం ఇదే తొలిసారి. మెరుపు వరదలతో మిచిగన్ సిటిలో డేంజరస్ వాతావరణం ఏర్పడింది. డ్యామ్‌లు తెగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్దప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఈడెన్ విల్లీ, శాన్ ఫోర్డ్, మిడ్ ల్యాండ్ ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చుట్టుపక్కల టౌన్‌షిప్‌లలో ఉంటున్న వారిని కూడా ఖాళీ చేయించారు.

Tags

Read MoreRead Less
Next Story