ఏడాదిలో వ్యాక్సిన్.. పాఠాలెన్నో నేర్పిన వైరస్: ఆరోగ్య శాఖ మంత్రి

ఏడాదిలో వ్యాక్సిన్.. పాఠాలెన్నో నేర్పిన వైరస్: ఆరోగ్య శాఖ మంత్రి
X

కరోనా వైరస్‌ని కట్టడి చేసేందుకు ప్రపంచంలోని ప్రముఖ యూనివర్శిటీలన్నీ అహర్నిశలు శ్రమిస్తున్నాయి. వ్యాక్సిన్ తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నాయి. ఏ దేశ వ్యాక్సిన్ ముందొచ్చినా ఆనందంగా స్వీకరించడానికి అన్ని దేశాలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ సంస్థలు రూపొందిస్తున్న వ్యాక్సిన్లు 3 నుంచి 5 నెలల్లో క్లినికల్ ట్రయల్స్ దశకు వస్తాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. అయితే వ్యాక్సిన్ రావడానికి ఏడాది కాలం పడుతుందని ఆయన అంటున్నారు. ఫేస్‌బుక్ వేదికగా భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా 100 వ్యాక్సిన్ సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. భారత్‌లో 14 సంస్థలు ఇదే పని మీద ఉన్నాయి. వ్యాక్సిన్ అనేది ఎప్పుడు వస్తుందనేది కచ్చితంగా చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. పరిశోధనలు, అనేక ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకుని కనీసం సంవత్సరమైనా పడుతుందని ఆయన చెప్పారు. అయితే ఈ లోపు మాస్కలు వాడడం, భౌతిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

నిజానికి వైరస్‌లు వచ్చి మనకి ఎన్నో పాఠాలు నేర్పుతున్నాయి. వాటిని మన జీవితంలో అంతర్భాగం చేసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. హెచ్‌ఐవీ, హెపటైటిస్ వంటివన్నీ మన జీవిత గమనాన్ని నిర్ధేశించి వెళ్లినవే అని మంత్రి అన్నారు. కరోనా వైరస్ నుంచి కూడా అలానే మనల్ని మనం కాపాడుకోవాలి. వైరస్ వ్యాప్తి ముందు ముందు ఎలా ఉంటుందనేది కూడా చెప్పలేము. ఎందుకంటే కరోనా పుట్టి నాలుగైదు నెలలే అయింది కాబట్టి అంచనా వేయడం కష్టమన్నారు.

లాక్డౌన్ ప్రకటించడం వల్ల చాలా వరకు కేసులు నియంత్రణలోకి వచ్చాయన్నారు. కరోనా రోగులకు ప్రత్యేక ఆస్పత్రులను కేటాయించి భారత్ కోవిడ్ కేసులను తగ్గించుకుంది. అలాంటి పరిస్థితి ఇటలీలో లేకపోవడంతో అక్కడ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని హర్షవర్ధన్ పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES