ఎండకు విలవిల్లాడిపోతున్న మూగ జీవాలు

ఎండకు విలవిల్లాడిపోతున్న మూగ జీవాలు

రోహిణి కార్తె ప్రారంభంతో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఎండకు మనుషులే కాదు.. మూగ జీవాలు విలవిల్లాడిపోతున్నాయి. పెరిగిన వేసవి తాపంతో పశు, పక్షులు అల్లాడిపోతున్నాయి. చల్లని ప్రదేశాలను వెతుక్కుంటూ రక్షణ పొందే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎండ వేడిమి తట్టుకొలేక కొన్ని.. నీళ్లు లేక గొంతెండి మరికొన్ని పక్షులు నేల రాలుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురిలో నోరు లేని మూగజీవాల వేసవి కష్టాలు వర్ణణాతీతంగా మారాయి.

గోదావరీ తీరంలో భక్తులు వదిలిపెట్టిన ఆహారాన్ని తిని జీవించే కాకులు.. లాక్‌డౌన్‌ కారణంగా వాటికి అక్కడ ఆహారం దొరకడం గగనంగా మారింది. దీనికి తోడు పెరిగిన ఎండలు పక్షులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. స్థానికంగా ఉన్న నీళ్ల ట్యాంకులు, పచ్చని చెట్ల కింద సేద తీరుతూ భానుడి నుంచి రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాయి మూగ జీవాలు.

ఇక ఊర కుక్కలు వాటర్‌ ట్యాప్ వద్ద, పూల చెట్ల పొదల్లో సేదతీరుతున్నాయి. వానరాలు సైతం ఆహారానికి, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాయి. ఊర పిచ్చుకలు గుడిసెలు పెంకుటిల్ల వెంబడి ఉంటూ జీవిస్తాయి. ఇప్పుడు పెంకుటిల్లు, తాటికమ్మలు, గడ్డి గుడిసెలు కనుమరుగైన పరిస్థితి. దీంతో మనిషితో అనుబంధం ఉన్న ఊర పిచ్చుకల మనుగడ కొంత ప్రశ్నర్థకంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story