213 దేశాలు.. 55 లక్షల పాజిటివ్ కేసులు..

213 దేశాలు.. 55 లక్షల పాజిటివ్ కేసులు..

చైనాలో పుట్టింది.. ప్రపంచమంతా చుట్టింది.. కరోనా గురించి మాట్లాడడం మొదలు పెట్టి దాదాపు రెండు నెలలు పూర్తయింది. అంతకు ముందే 2019 డిసెంబర్‌లోనే వూహాన్‌లో వైరస్ వెలుగు చూసినా మూడో కంటికి తెలియనివ్వలేదు చైనా ప్రభుత్వం.. నెల రోజులకే అక్కడక్కడా కరోనా కేసులు నమోదవడం.. మార్చి నాటికి ఓ మహమ్మారిగా రూపు దాల్చడం జరిగిపోయింది. ఇప్పుడు ఏకంగా 213 దేశాలకు విస్తరించింది. 55 లక్షల మందికి వైరస్ సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3.45 లక్షలకు చేరుకుంది. 23.02 లక్షల మంది కోలుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ వణికించింది. అక్కడ ఇంకా ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 18 వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 16,86,436కు చేరుకుంది. ఇక మరణించిన వారి సంఖ్య 99,300.

నిన్న మొన్నటి వరకు అమెరికా తరువాతి స్థానంలో రష్యా ఉంటే ఇప్పుడు బ్రెజిల్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. అక్కడ 3.62 లక్షల కేసులు నమోదు కాగా 22,716 మంది మరణించారు. మూడవ స్థానంలో రష్యా, తరువాత స్పెయిన్, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ ఉన్నాయి. ఇదిలా ఉండగా 130 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో ఆదివారం ఒక్కరోజే ఆరువేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1.38 లక్షలకు చేరువైంది.

Tags

Read MoreRead Less
Next Story