బ్లాక్‌ లిస్ట్‌లో 33 చైనా కంపెనీలు

బ్లాక్‌ లిస్ట్‌లో 33 చైనా కంపెనీలు

అమెరికా-చైనాల మధ్య కోల్డ్‌ వార్‌ మరింత ముదిరింది. 3 రోజుల క్రితం తమ స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి చైనా కంపెనీలను డీలిస్ట్ చేయాలని అమెరికా నిర్ణయించగా, దీనికి యూఎస్‌ సెనేట్‌ కూడా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తాజాగా 33 చైనా కంపెనీలను ఎకనామిక్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఈ లిస్ట్‌లో 7 టెక్నాలజీ కంపెనీలు ఉండగా... మిగతా సంస్థలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలని అమెరికా ట్రేడ్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది.

ఇప్పటికే కరోనా విషయంలో చైనాపై అమెరికా గుర్రుగా ఉంది. ఏ చిన్న ఆధారం దొరికినా అంతర్జాతీయ సమాజం ముందు చైనాను ఇరికించే పనిలో ఉన్న అగ్రరాజ్యం... తాజాగా మైనార్టీల పట్ల చైనా వ్యవహరిస్తోన్న తీరుపై మండిపడింది. చైనా తరపున గూఢచర్యం జరుపుతున్నారనే ఆరోపణలపై 33 కంపెనీలను ఎకనామిక్‌ బ్లాక్‌లిస్ట్‌లో చేర్చుతున్నట్టు అమెరికా ప్రకటించింది. ఈ సంస్థలకు చైనా మిలిటరీతో సంబంధాలు ఉన్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

గత ఏడాది కూడా అమెరికా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో మొత్తం 28 చైనా కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌లో అమెరికా చేర్చడం అంతర్జాతీయంగా సంచలనమైంది. మరోవైపు చైనా కూడా తన పవరేంటో అమెరికాకు రుచి చూపేందుకు సిద్ధమవుతోన్నట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ఇక గత ఏడాది డిఫెన్స్‌ రంగానికి 177 బిలియన్‌ డాలర్లను కేటాయించిన చైనా... ఈ ఏడాది దానిని 179 బిలియన్‌ డాలర్లకు పెంచింది. దీంతో తమకు దేశ రక్షణే తొలి ప్రాధాన్యత అని అమెరికాకు చైనా స్పష్టం చేసినట్లయింది.

Tags

Read MoreRead Less
Next Story