ఒక్కడే 10 హత్యలు చేశాడు

ఒక్కడే 10 హత్యలు చేశాడు

తెలంగాణలో సంచలనం సృష్టించిన వరంగల్ జిల్లా గొర్రెకుంట హత్యల కేసు మిస్టరీని 72 గంటల్లోనే చేధించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌ను మీడియా ముందు హాజరుపరిచారు. ఒక హత్య నుంచి తప్పించుకోవడం కోసం మరో 9 హత్యలు చేసినట్లు సంజయ్‌ ఒప్పుకొన్నట్లు తెలిపారు సీపీ రవీందర్‌. ఈ కేసులో దర్యాప్తు మొత్తం ఆరు బృందాలు పాల్గొన్నట్లు తెలిపారు. ఆరేళ్ల క్రితం వరంగల్‌ వచ్చిన సంజయ్‌కు.. మక్సూద్‌ కుటుంబంతో పరిచయం ఏర్పడింది. వీరంతా గోనేసంచులు తయారీ చేస్తున్నారు.

ఇదే క్రమంమలో మక్సూద్‌ సోదరి రఫికతో సాన్నిహత్యం ఏర్పడింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు సంజయ్‌. అయితే తన కూతురితోనూ.. సంజయ్‌ సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించిన రఫిక... దీనిపై నిలదీసింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న సంజయ్‌.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్‌లో బెంగాల్‌కు బయల్దేరారు. చివరికి ఆమెకు మజ్జిగ ప్యాకెట్లో నిద్ర మాత్రలు కలిపి రైల్లోనుంచి బయటకు తోసేశాడు రాజమండ్రిలో రైలు దిగి ఇంటికొచ్చాడు. నిడదవోలు మండల ప్రాంతంలో బాడీని గుర్తించారు పోలీసులు. తాడేపల్లి గూడెం పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయితే.. మక్సూద్ కుటుంబం.. రఫిక గురించి అడగటం మొదలుపెట్టింది. చెప్పకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. దీంతో ఈ కుటుంబాన్ని కూడా హతమార్చాలని నిర్ణయించాడు. ఈ నెల 16 నుంచి 21 వరకు తరచుగా గోడౌన్ దగ్గరకు వెళ్లాడు. మక్సూద్ కొడుకు పుట్టిన రోజుకు ఒకరోజు ముందు హన్మకొండలో నిద్ర మాత్రలు కొన్నాడు. 20న అక్కడికి వెళ్లి.. ఆహారంలో నిద్ర మాత్రల్ని కలిపాడు. మక్సూద్ ఫ్యామిలీలో ఆరుగురితో పాటు అనుమానం వస్తుందనే ఉద్దేశంతో.. బిహార్‌కు చెందిన శ్రీరామ్, శ్యామ్ అనే ఇద్దరితో పాటు షకీల్‌ ఆహారంలోనూ నిద్ర మాత్రలు కలిపాడు. దీంతో వీరంతా మత్తులోకి వెళ్లిపోయారు. ఇదే అదనుగా ఒక్కొక్కరిని గోనె సంచి పెట్టి ఒక్కడే అందర్నీ బావిలో పడేశాడు. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు ఈ పని చేశాడు. షకీల్ పర్సు, ఇతర సామాన్లు తీసుకొని సైకిల్‌పై తన ఇంటికి చేరుకున్నాడు.

సైకిల్ మీద ఇంటి నుంచి బయల్దేరిన సీసీటీవీ దృశ్యాల ఆధారంగా సంజయ్‌ను అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇలా ఒక్క హత్యను కప్పి పుచ్చుకోవడం కోసం మరో 9 హత్యలు చేసినట్లు తెలిపారు సీపీ రవీందర్‌. త్వరలోనే ఛార్జీషీట్ నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. 72 గంటల్లోనే ఈ కేసును చేధించామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story