Top

న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు.. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే సహా 49 మందికి నోటీసులు

న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు..  ఎంపీ, మాజీ ఎమ్మెల్యే  సహా 49 మందికి నోటీసులు
X

మీడియాలోను, సోషల్ మీడియాలోనూ న్యాయ వ్యవస్థపై అభ్యంతరకరమన వ్యాఖ్యలు చేయడాన్ని, పోస్టులు పెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వీటిని కోర్టు ధిక్కరణగా పేర్కొంటూ 49 మందికి నోటీసులు ఇచ్చింది. సామాజిక మాద్యమాల్లో పోస్టింగ్‌లపై రెండ్రోజులుగా అత్యున్నత న్యాయస్థానంలో పెద్ద చర్చే జరిగింది. సోమవారమే న్యాయమూర్తులంతా సమావేశమయ్యారు. చీఫ్ జస్టిస్ JK మహేశ్వరి, జస్టిస్‌ సి.ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. చూస్తుంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉన్నట్టు కనిపిస్తోందని బెంచ్ అభిప్రాయపడింది. అటు, ఇంగ్లీష్ మీడియంపై తీర్పు సందర్భంగానూ అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఫిర్యాదు చేసినా.. ఆ కేసు విచారణలోనూ పురోగతి లేదంటూ కోర్టు వ్యాఖ్యానించింది.

న్యాయ వ్యవస్థను కించ పరుస్తూ పోస్టులు పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతిన చెలరేగిపోయారు. జడ్జీలకు కూడా దురుద్దేశాలు ఆపాదించారు. ఒకటా రెండా YCP కార్యక్తలు దిగజారి పెట్టిన పోస్టులు చాలానే ఉన్నాయ్. డాక్టర్ సుధాకర్ కేసును CBIకి ఇవ్వడం వాళ్లకు అస్సలు రుచించలేదు. కోర్టు ఆదేశాలు రావడం ఆలస్యం రెచ్చిపోయి పిచ్చి రాతలతో సామాజిక మాద్యమాల్లో చిందులుతొక్కారు. YCP ఎంపీ నందిగం సురేష్ సైతం అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాజీ MLA ఆమంచి కృష్ణ మోహన్ కూడా ప్రత్యర్థులపై విమర్శలు చేసినంత ఈజీగా న్యాయవ్యవస్థ తీరును ప్రశ్నించారు. ఇవన్నీ మెయిళ్ల రూపంలోను, వీడియోల రూపంలో కోర్టుకు చేరాయి. అడ్వొకేట్ లక్ష్మీనారాయణ సహా కొందరు చేసిన ఫిర్యాదులపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్‌ నేతృత్వంలోని బెంచ్.. దీన్ని సుమోటోగా స్వీకరించింది. మొత్తం 49 మందికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌, చీరాల మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్, రవిచంద్రారెడ్డి సహా ఈ నోటీసులు అందుకున్న వారిలో పలువురు YCP వాళ్లున్నారు. అలాగే ఆ పార్టీ తరపున సోషల్ మీడియాలో యాక్టివ్‌గా పనిచేసే వాళ్లూ ఉన్నారు. మెట్ట చంద్రశేఖర్ రావు, కళానిధి గోపాల కృష్ణ, కిశోర్‌ రెడ్డి, చందు రెడ్డి, జి.శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, కె.గౌతమి, కత్తి మహేష్, రవికిరణ్ ఇంటూరి సహా 49 మందికి కోర్టు నోటీసులిచ్చింది. అత్యున్నత ధర్మాసనాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగ్‌లపై రిజిస్టార్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పోస్టులు పెట్టిన వారిపై సీఐడీ విచారణ జరగలేదంటూ.. హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది అశ్విన్ కుమార్‌ ధర్మాసనానికి విన్నవించారు. పోస్టింగ్‌లు పెట్టేవారిపై పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్‌ ప్రకారం విచారణ చేపట్టాలన్నారు. పోస్టులు పెట్టినవారి ఐపీ అడ్రస్‌ల ఆధారంగా విచారణ జరపాలన్నారు. దీనిపై.. ప్రభుత్వం తరపున పూర్తి వివరణ ఇచ్చేందుకు ఏజీ మరికొంత సమయం కోరారు.

తదుపరి విచారణకు నోటీసులు అందుకున్న వారంతా స్వయంగా కానీ, న్యాయవాదులతో కానీ హాజరు కావాలని హైకోర్టు చెప్పింది. వీలైనంత త్వరగా సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని గుర్తించి కేసులు నమోదు చేసే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. అటు, ప్రజాప్రతినిధిగా ఉండి నందిగం సురేష్ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభకు ఫిర్యాదు చేస్తామన్నారు అడ్వొకేట్ లక్ష్మీనారాయణ. అలాగే.. ప్రస్తుతం కోర్టు నోటీసులు అందుకుంటున్న 49 మంది తరపున వాదించేందుకు ఎవరూ ముందుకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. న్యాయ వ్యవస్థనే కించ పరిచినవారి పక్షాన వాదించకుండా దూరంగా ఉందామని సహచరులను కోరారు.

ఈ విచారణను 49 మందికి మాత్రమే పరిమితం చేయకూడదనే డిమాండ్‌ కూడా వినిపిస్తోంది. న్యాయ వ్యవస్థపై రాజకీయ ముసుగులో దాడులు చేయడాన్ని సహించరాదని.. భవిష్యత్‌లో ఇలాంటివి జరక్కుండా ఉండేలా యాక్షన్ ఉండాలని కోరుతున్నారు. దీన్ని కేవలం కోర్టు ధిక్కారంగా మాత్రమే చూడకూడదని ప్రాసిక్యూట్ చేసి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 1971-కోర్టు ధిక్కార చట్టం ప్రకారం పడే శిక్ష స్వల్ప కాలమే అయినా ఈ ఘటనలో కచ్చితంగా దోషులకు శిక్ష పడాలంటున్నారు. జడ్జిలను విమర్శించడం అంటే అది కేవలం వారికి సంబంధించిన వ్యవహారంగా చూడకూడదని మొత్తం న్యాయ వ్యవస్థనే తప్పుపట్టినట్టని అడ్వొకేట్లు అంటున్నారు. అటు, సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించడాన్ని విపక్షాలన్నీ స్వాగతించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏ చిన్న పోస్టు పెట్టినా, మాట్లాడినా వాళ్లకు నోటీసులు ఇస్తున్న CID.. న్యాయ వ్యవస్థపై సోషల్ మీడియా పోస్టుల బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. మే 22న డాక్టర్ సుధాకర్ కేసును హైకోర్టు CBIకి ఇస్తున్నట్టు ప్రకటించడం ఆలస్యం సామాజిక మాద్యమాల్లో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిపై చట్టప్రకారం చర్యలు ఉండాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Next Story

RELATED STORIES