ఏపీలో నాసిరకం మద్యం.. తెలంగాణ నుంచి అక్రమంగా బ్రాండెడ్‌ లిక్కర్‌ తరలింపు

ఏపీలో నాసిరకం మద్యం.. తెలంగాణ నుంచి అక్రమంగా బ్రాండెడ్‌ లిక్కర్‌ తరలింపు

తెలుగు రాష్ట్రాలలో మద్యం అమ్మకాలు నిలిపివేయడంతో గత రెండు నెలలుగా మద్యం షాపులు మూతబడ్డాయి. ఇటీవల కాలంలో లాక్ డౌన్ ఆంక్షలలో సడలింపు ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో మద్యానికి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. .ఆంధ్రాలో పరిమిత సంఖ్యలో షాపులు ఉండడం, సరైన బ్రాండ్స్ లభ్యం కాకపోవడంతో ఆంధ్రాకు సరిహద్దుల్లో ఉన్నఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేటకు వేల సంఖ్యలో మందుబాబులు క్యూ కడుతున్నారు. ఒక్కో బాటిల్ పై రెట్టింపు ధర చెల్లించైనా మద్యాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ఈనేపథ్యంలో.. మద్యానికి పెరిగిపోయిన డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనే ఆలోచనతో రంగంలోకి దిగారు మద్యం సిండికేట్ వ్యాపారులు. షాపుల్లో అమ్మాల్సిన మద్యం బాటిళ్లను బ్లాక్ లో అమ్మడం మొదలుపెట్టారు. అడిగేవారు లేకపోవడంతో యథేచ్ఛగా మద్యాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు సైతం మద్యం వ్యాపారులకు కొమ్ము కాస్తుండడంతో ఇష్టారీతిన చెలరేగిపోతున్నారు. చీఫ్ బ్రాండ్స్ ను షాప్ లో అమ్మకానికి పెట్టి మమ అనిపిస్తున్నారు.

ఆంధ్రాలో మద్యానికి ఉన్న డిమాండ్ ను ఆసరాగా తీసుకుని అధిక ధరలకు మద్యాన్ని విచ్చలవిడిగా ఆంధ్రాకు తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో పశ్చిమగోదావరి జిల్లాలో భారీ స్థాయిలో మద్యం పట్టుబడింది. అయితే..ఇదంతా అశ్వారావుపేట నుంచి తరలివచ్చిన మద్యం అని తేలినా ఇక్కడి ప్రొహిబిషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.1000 రూపాయలు ఎమ్మార్పీ ఉన్న ఒక బాటిల్ కు ఆంధ్రాలో 2000 రూపాయల ధర పలకడంతో అశ్వారావుపేటలోని మద్యం షాపుల్లోని సరుకంతా ఆంధ్రాలో ప్రత్యక్షమవుతోంది.

అశ్వారావుపేట పట్టణాన్ని మరో యానాం గా మారుస్తున్నారు ఇక్కడి సిండి"కేటు"గాళ్ళు. మద్యం ఏరులై పారుతుందికానీ, ఇక్కడి మందుబాబులకు మాత్రం లైన్లో నిలిచినా మద్యం దొరకడం లేదు. పక్క రాష్ట్ర ప్రజలకు మాత్రం కిక్కు ఫుల్లుగా దొరుకుతోంది. మందుబాబుల బలహీనతను క్యాష్ గా మార్చుకోవడంలో సిద్ధహస్తులుగా మారారు మద్యం వ్యాపారులు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ అదికారులు స్పందించి,అక్రమ మద్యం తరలింపును అడ్డుకుని, సిండికేట్ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story