అమ్మాలే.. ఆకలేస్తుంది.. తల్లి మరణించిందని తెలియక.. ఆ చిన్నారి..

అమ్మాలే.. ఆకలేస్తుంది.. తల్లి మరణించిందని తెలియక.. ఆ చిన్నారి..

అమ్మ ఎందుకు ఇంకా అలానే పడుకుంది.. పైగా దుప్పటి కూడా కప్పుకుంది. ఇది తీసేస్తే లేస్తుందేమో. నాకు ఆకలేస్తుందని ఆమెకు ఎలా చెప్పాలి. నాకు ఇంకా మాటలు రాలేదు. నాకు ఓ అన్నయ్య ఉన్నాడు.. వాడికీ ఏమీ అర్థం కావట్లేదు. అటూ ఇటూ చూస్తున్నాడు. మాకు ఎవరూ ఏమీ పెట్టట్లేదు. అమ్మకు రైల్లోనే ప్రాణం పోయిందని, రైలు సిబ్బందే అమ్మ బాడీని తీసుకువచ్చి ఇక్కడ పడేసిందని మా చిట్టి మనసులకు ఎలా తెలుస్తుంది. ఇప్పుడు మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు. ఎవరు అక్కున చేర్చుకుంటారు. అమ్మా నువ్వొక్కదానివే అలా వెళ్లకపోతే మమ్మల్ని కూడా తీస్కెళ్లొచ్చుగా..

ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వలస కార్మికుల బ్రతుకులు ఎలా ఉంటాయో కళ్లకు కడుతోంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి వచ్చిన శ్రామిక్ రైల్లో వచ్చిన కార్మికుల్లో 23 ఏళ్ల యువతి ఉంది. ఆమె ఆకలికి, దాహానికి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయింది. రైలు ముజఫర్‌పూర్‌కు చేరుకోకముందే ఆమె ప్రాణం పోయింది. ఆమె మృత దేహాన్ని స్టేషన్‌లోనే వుంచి దుప్పటి కప్పారు రైల్వే సిబ్బంది.

అమ్మ మరణించిన విషయం ఆమె ఇద్దరు బిడ్డలకి తెలియక అటూ ఇటూ దిక్కులు చూస్తున్నారు. చిన్నవాడు అమ్మ కప్పిన దుప్పటి లాగి ఆడుకుంటున్నాడు. అటూ ఇటూ చూస్తున్నాడు. ఈ దృశ్యం అక్కడి ప్రయాణీకులను కదిలించడంతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది వైరల్ అయ్యింది. మృతురాలు సోదరి, భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కతిహార్‌కు వెళుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

లక్షలాది మంది తమ సొంత రాష్ట్రాలకు వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తున్నారు. కార్మికులను వారి స్వస్థలాలకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేసినా నిర్వహణ గురించి అనేక ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా రైళ్లలో ప్రయాణించే కార్మికులకు సరైన ఆహారం, నీరు కూడా సప్లై చేయలేకపోయారు. దానికి తోడు రైళ్లు కూడా ఆలస్యంగా ప్రయాణించడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story