మిడతలను ఆహారంగా తీసుకుంటే..

మిడతలను ఆహారంగా తీసుకుంటే..
X

మిడతలు దండుగా దాడి చేస్తున్నాయి. వందలు, వేలు కాదు, లక్షల సంఖ్యలో విరుచుకుపడుతున్నాయి. పొలాలపై దాడి చేస్తూ పంటలను సర్వనాశనం చేస్తున్నాయి. మిడతలంటే తేలిగ్గా తీసుకోవద్దు. అవి చాలా చాలా డేంజర్. మిడతల దండు వాలిన పొలం, కాలకేయులు అడుగుపెట్టిన రాజ్యం శ్మశానమైపోతుంది అని బాహుబలి సినిమాలో ఒక డైలాగ్‌ ఉంటుంది. కాలకేయుల సంగతేమో గానీ మిడతలు దాడి చేసిన పంట మాత్రం సర్వ నాశనమే. అసలు అక్కడ పచ్చటి పంట ఉండేది అనడానికి ఆనవాళ్లే మిగలవు. అవి వాలిన చోట పచ్చదనమంతా హుష్ కాకి అయిపోతుంది. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. 10 ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఓ చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుంది.

ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవి. ఒక చదరపు కిలో మీటర్ దండులో 8 కోట్ల వరకు మిడతలు ఉంటాయి. గాలి వేగాన్ని బట్టి రోజుకు సుమారు 135 నుంచి 150 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటి సంతానోత్పత్తి రేటు కూడా ఎక్కువే. బతికే 90 రోజుల్లో ఒక్కో మిడత 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు 45 రోజుల్లో పెరిగి పెద్దవై, తర్వాతి నెల రోజుల్లో అవీ గుడ్లు పెడతాయి. మిడతలకు ఇదే తినాలనే నియమం లేదు. పచ్చగా కళకళలాడే ఏ మొక్కైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు 35 వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో లాగించగలవు. అవి వాలిన చోట పచ్చ దనం కనుమరుగే.

మిడతల ముప్పును నివారించడానికి స్పష్టమైన పరిష్కారం ఏమీ లేదు. దాంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు తమకు తెలిసిన ప్రయోగాలన్నీ చేస్తున్నారు. పురుగుమందులు కలిపిన నీటిని పంటలపై చల్లుతున్నారు. మిడ తల దండును తరిమికొట్టడానికి డప్పుల్ని కొడుతున్నారు. టపాసులు పేలుస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తున్నా రు. ప్రభుత్వాలు కూడా మిడతల దూకుడుకు బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున కెమికల్స్ చల్లించడానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియా పరిశోధకులు వింత పరిష్కారం చెప్పారు. మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలా దేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెబుతున్నారు. ఐతే, ఈ ప్రపోజల్‌ను పాటించడం మనదేశంలో సాధ్యం కాదు. ఇప్పటికే కరోనా వైరస్‌ దెబ్బకు మాంసాహారం తినడానికి ప్రజలు జంకుతున్నారు. అలాంటిది, మిడతలను తినమంటే ఇంకేమైనా ఉందా..?

Next Story

RELATED STORIES