మరపురాని మనిషి ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే..

మరపురాని మనిషి ఎన్టీఆర్ గురించి చెప్పాలంటే..

1931 వ సంవత్సరం సెప్టెంబరు 15 వ తారీఖు;మొట్టమొదటి తెలుగు చలనచిత్రం ’భక్త ప్రహ్లాద’ విడుదలైన రోజు. అప్పటికి సుమారు ఎనిమిది సంవత్సరాల వయసున్న పిల్లవాడొకడు తోటి పిల్లలతో కలసి ఆడుకుంటున్నాడు. తను పరిపాలించడానికి ఓ రంగం సిద్ధమౌతున్న సంగతి అతనికి అప్పుడు తెలియదు. కాలంతో పరిగెడుతూ పిల్లవాడు యువకుడయ్యాడు. కాలేజీ చదువు, నాటకాలు ఒకవైపు, కుటుంబానికి ఆసరాగా సైకిలు మీద తిరుగుతూ ఇంటింటికీ పాలుపొయ్యడం మరోవైపు. ఈలోగా కాలం ఇంకాస్త ముందుకు వెళ్ళి అతనిని ఓ చిన్న పోలీసు ఇనస్పెక్టరు పాత్ర ద్వారా సినిమా రంగంలో ప్రవేశపెట్టింది. ఇక అక్కడనుండి అతను వడివడిగా అడుగులు వేసుకుంటూ తెలుగు ప్రజలగుండెలవైపు వేగంగా వచ్చాడు.. తన అసమాన నటనా కౌశలంతోను తెలుగు సినీ సార్వభౌముడయ్యాడు. తెలుగు వారి రాముడుగా, కృష్ణుడుగా, సినిమా దేవుడుగా నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాతుడయ్యాడు.

నటనకు ముఖ్యంగా కావలసిన ఆహార్యము, అంగికము, వాచికము, సాత్వికము సమపాళ్లలో పోతపోస్తే వచ్చిన రూపమే ఎన్టీఆర్ ఏమో అనిపిస్తుంది. మాయాబజార్ కృష్ణుడు, లవకుశ రాముడు, పాండవ వనవాసం భీముడు, దానవీరశూరకర్ణ దుర్యోధనుడు, సీతారామకళ్యాణం రావణుడు, ఇలా నాయకులు, ప్రతినాయకులు అందరూ రామారావులే.

అసలు దానవీరశూరకర్ణ సినిమా చూసిన తరువాత, ఒకవేళ నిజం దుర్యోధనుడు ఈ భూమ్మీదకు వచ్చినా నువ్వు నువ్వుకాదు ఎన్టీఆరే అసలు దుర్యోధనుడంటారేమో. పాతాళభైరవిలో సాహసం చేసే డింభకుడిగా అలరిస్తే, కన్యాశుల్కం సినిమా చూసిన తరువాత గురజాడ వారి గిరీశం ఎలా ఉంటాడో ఊహించేసుకుంటాం.

గుండమ్మకథ సినిమాలో సగం ఊడిపోయిన బొత్తాలున్న చొక్కా, పొట్టి నిక్కరు వేసుకున్న అంజిగాడు కనపడతాడు తప్ప ఎన్టీఆర్ కనిపించడు. పురాణ పాత్రలు వేసేటప్పుడు కాళ్ళకు చెప్పులు వేసుకోకపోవడం, మాంసాహారం తినకపోవడం, నేలమీదే నిద్రించడం ఆయనకు తను ధరించే పాత్రల మీద ఉన్న గౌరవానికి, నిబద్ధతకు ఉదాహరణలు. ఆయన నటించిన సినిమాలు తెలుగు సినీ నటులందరికీ గ్రామర్ పుస్తకాల్లాంటివి. ఆహార్యం, ఆంగిక, వాచకాభినయాలకు ఆయన నటనే ఓ పాఠశాల.

ఆయన వృద్దులకు రాముడో,కృష్ణుడో,వెంకటేశ్వరస్వామో.. ఎవరో ఒక దేవుడు. యువకులకు ప్రేమపాత్రుడు.పిల్లలకు అదర్శమూర్తి. తనకున్ననిర్మాతలకు,సాంకేతికనిపుణులకు,సహ నటీనటులకు కోటగోడ. నమ్మిన వారికి అభయ హస్తం.. నమ్మకపోయినా స్నేహహస్తం ఎన్టీఆర్ స్టైల్..

ఎన్టీఆర్ లాంటి టాప్ హీరో.. నటుడిగా దైవత్వాన్ని నింపుకుని, వెండితెరపై ఆ దైవరూపాన్ని చూపించినవాడు.. రావణాసురుడుగా నటిస్తే, ప్రేక్షకులు అంగీకరిస్తారు.. కానీ అంగీకరించారు.. ఎందుకంటే ఆ పాత్ర పోషించింది. ఎన్టీఆర్.. ‘‘అసలు రావణాసురుడంటే, రసజ్ఞుడుగా, కళా ప్ర్తపూర్ణుడుగా అద్వితీయుడు. త్రిలోకాలలోనే సాటిలేని వైశికుడు. సామవేదకర్త తనపై అలిగిన శంకరుని ప్రీతికి పొట్టచీల్చి ప్రేగులతో రుద్రవీణ కట్టి జీవనాదంతో పార్వతీశుని తన ముందుకు ప్రత్యక్షం చేసుకోగల్గిన సంగీత కళా తపస్వి’’ అంటారు ఎన్టీఆర్‌.

ఆయన ఎవర్నీఅనుసరించరు.అనుసరించలేదు. ఆయన బాణీని అనుసరించేవారే వుంటారు. అందుకు ఆయన నటించిన ఎన్నో సినిమాలు ఉదాహరణలుగా ఉన్నాయి. క్లిష్టమైన పాత్రల్లో కూడా గొప్పనైపుణ్యం చూపించడం ఒక్క ఎన్టీఆర్ కే చెల్లు. ఇంకా చెప్పాలంటే అతను ఒక్క హీరోపాత్రధారేకారు. క్యారెక్టర్ యాక్టర్. అందుకే ఏ పాత్ర ధరించినా అందులో పాదరసంలా పాతుకుపోతారు.

ఇవన్నీ కాదండీ.. ఎన్టీఆర్ మహానటుడే.. ఎవరు కాదనగలరు. మరి అలాంటి నటుడు ఎంచుకునే పాత్రలు ఏ స్థాయిలో ఉంటాయి. ప్రేక్షకుల్లో తనపై ఉన్న అభిమానానికి ఇంకా చెప్పాలంటే వారిచ్చిన ఇమేజ్ కు అనుగుణంగా ఉండాలి కదా.. కానీ ఒక్క ఎన్టీఆర్ మాత్రమే పాత్రకు తగ్గట్టుగా ఇమేజ్ ను పక్కన బెట్టాడు. దేవుడుగా చేసిన వాడే విలన్ గా చేసి మెప్పించాడు.. అయితే ఎంతో ఇమేజ్ ఉన్న ఆయన ఆ పాత్రలు చేయడం నర్తనశాలలో బృహన్నలగా చేయడం వేరు.. కాదంటారా..

ఎన్టీఆర్ గురించి మాట్లాడాలంటే ‘‘ప్రవహించే నీటిని కొలిచినట్ల్రే అవుతుంది. ప్రవహించే నీటిని కొలవాలంటే ఎంత కష్టమో రామారావు గార్ని గురించి చెప్పటం అంతే కష్టం’’.. అంటారు నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యానారాయణ.. నిజమే ఆయన నటనను ఫలానా అంటూ విభజించగలమా.. ఆ ప్రతిభను కొలమానాల్లో చూడగలమా ..

క్రమశిక్షణకు మారుపేరు ఆయన.. షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా అనవసరమైన మాటలుండవు.. కెమెరా ముందుకు వెళ్లే వరకూ కూడా తర్వాత చేయబోయే సీన్ గురించి రిహార్సల్ చేస్తూనే ఉండేవారు. ఈ క్రమశిక్షణను చివరి సినిమా వరకూ కొనసాగించారు. ఆయన సెట్స్ లో ఉంటే అన్ని పనులూ వేగంగా జరుగుతాయి.. సింపుల్ గా చెప్పాలంటే అంత పెద్ద హీరో అయినా ఆయన కోసం ఏ నిర్మాతా సెట్స్ లో ఎప్పుడూ వెయిట్ చేయలేదు..

నటుడిగా కీర్తి, ప్రతిష్టలు పెరిగాయి. తను నటించిన సినిమాలెన్నో సూపర్ హిట్లు సాధించినా .. ఎప్పుడూ అనవసరంగా పారితోషికం పెంచలేదు. అందుకు ఉదాహరణ.. ఆయన సినిమాల్లోకి వచ్చిన 22రెండేళ్ల వరకూ పారితోషికం కేవలం వేలల్లోనే ఉండేది.. 1972 తర్వాతే ఆయన రెమ్యూనరేషన్ లక్షల్లోకి వచ్చిందంటే ఆశ్చర్యం కలగక మానదు..

ఎన్టీఆర్ అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. నటుడు, నిర్మాత, దర్శకుడు, కథారచయిత, రాజకీయవేత్త... అయినా అడుగు పెట్టిన అన్ని రంగాల్లో విజయ దుందుభి మోగించిన ఏకైక నటుడు, రాజకీయ వేత్త ఆయన. ఇలాంటి పర్సనాలిటీ ప్రపంచంలో మరొకరున్నారో లేదో తెలియదు కానీ, ఉన్నా .. వారు ఎన్టీఆర్ తర్వాతే అవుతారని ప్రతి తెలుగు వాడూ ఘంటాపథంగా చెబుతాడు.

భారతదేశంలో కేవలం ఇద్దరే ఇద్దరు నటులు అటు సినిమారంగం లోను, ఇటు రాజకీయరంగం లోను తారాపథాన్ని అందుకున్నారు. వారిలో ఒకరు తెలుగువారి అన్న ఎన్టీఆర్.. ఇంకొకరు తమిళుల అన్న ఎమ్జీయార్... సినిమా కృష్ణునిగా ధర్మసంస్థాపనకోసం అవతరిస్తానని అభయం ఇచ్చిన ఎన్టీఆర్ , ’తెలుగుజాతి ఆత్మగౌరవం’ నినాదంతో రాజకీయ అవతారం ఎత్తాడు. తెలుగుదేశాన్ని స్థాపించి రాజకీయాల్లో 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు.

అయితే రంగుల ప్రపంచం సినీలోకంలో ఉన్నప్పుడు రారాజుగా వెలుగొందిన ఆయన రాజకీయ వేత్తగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పలేం. అందుకే చివరి రోజుల్లో అనూహ్య పరిణామాలు అనేకం జరిగాయి. అయినా దేనికీ వెరవని ధీరోదాత్తత సొంతమైన ఆ మనిషి చివరి వరకూ ధీర గంభీరంగానే ఉన్నారు.

దశాబ్ధాలపాటు తెలుగు చలనచిత్రసీమని, ఏడేళ్ళపాటు తెలుగు నేలని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎన్టీఆర్ ప్రతి తెలుగు వాడి గుండెల్లో నిలిచే ఉంటారు..తెలుగులో ఎంతమంది గొప్పనటులు వచ్చినా.. తరాలు దొర్లినా.. మహానటుడిగా తన స్థానాన్ని మాత్రం ఆచంద్రతారార్కం.. తనకే సుస్థిరం చేసుకుని ఈ సినిమా రాముడు నిజం దేవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు.

Tags

Read MoreRead Less
Next Story