జమ్మూ కాశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూ కాశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్ర కుట్ర భగ్నం

జమ్మూ కాశ్మీర్‌లో పుల్వామా తరహా ఉగ్ర కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి.. కారులో ఉంచిన భారీ పేలుడు పదార్ధాన్ని నిర్వీర్యం చేశాయి.. పుల్వామా పోలీసులు, సిఆర్పిఎఫ్, ఆర్మీ కూడా ఈ ఆపరేషన్లో పాల్గొన్నాయి. రాజ్‌పురా రోడ్‌లోని షాదిపుర సమీపంలో తెల్లని రంగు గల శాంట్రో కారులో పేలుడు పదార్ధాలను గుర్తించారు, దాంతో ఆ కారును పట్టుకున్నారు. అనంతరం ఇందులో ఉన్న 20 కిలోల ఐఇడి (ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం) స్వాధీనం చేసుకున్నారు. కారు లోపల ఉన్న డ్రమ్స్‌లో పేలుడు పదార్థాలు ఉంచారు.. కారును సీజ్ చేసిన అనంతరం, ముందు జాగ్రత్తగా భద్రతా దళాలు చుట్టుపక్కల ఉండే ప్రజలను వేరే ప్రాంతానికి తరలించారు. ఆ తరువాత పేలుడు పరికరం (IED)ని సురక్షితంగా నిర్వీర్యం చేశారు.

కాగా బుధవారం కొందరు ఉగ్రవాదులు పేలుడు పధార్ధాలతో కారులో వెళుతున్నారని పుల్వామా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆర్మీ, సీఆర్పీఎఫ్ కు కూడా సమాచారం అందించారు.. అందరూ కలిసి ఆ కారును వెంబడించారు. దాంతో భద్రత దళాలు ఫాలో అవుతున్నారని పసిగట్టిన కారు డ్రైవర్ వెంటనే కారు దిగి పారిపోయాడు.. భద్రతా దళాలు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ కారు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందినదిగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే గతేడాది పుల్వామాలో ఇదే తరహాలో భద్రత దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తరువాత భారత్ కూడా బాలా కోట్ పై దాడి చేసి దాదాపు 200 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.

Tags

Read MoreRead Less
Next Story