సీఆర్‌పీఎఫ్ జవాన్లకు సలాం.. గాయపడిన నక్సల్స్‌కు రక్తదానం..

సీఆర్‌పీఎఫ్ జవాన్లకు సలాం.. గాయపడిన నక్సల్స్‌కు రక్తదానం..
X

వారు శత్రువులే కావచ్చు.. వారి హృదయం కాఠిన్యమే కావచ్చు. కానీ ఆపదలో ఉన్నారు.. రక్షించాల్సిన బాధ్యత కంటే మానవత్వమే వారి ప్రాణాలు కాపాడేందుకు ముందడుగు వేసేలా చేసింది. ఎన్‌కౌంటర్ తర్వాత గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఇద్దరు నక్సలైట్లకు సీఆర్పీఎఫ్ జవాన్లు రక్తదానం చేశారు. జార్ఖండ్‌లోని పశ్చిమ సింఘ్‌భూమ్ జిల్లాలోని మన్మారు-టెబో ప్రాంత అడవుల్లో నక్సలైట్లకు, జవాన్లకు మధ్య జరిగిన పోరులో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు.

మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో వారిని బంధించి ఆస్పత్రికి తరలించారు. గాయపడిన మావోయిస్టులలో ఒకరైన మనోజ్ హెస్సాకు గురువారం సాయింత్రం సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్స్ ఓం ప్రకాష్ యాదవ్, సందీప్ కుమార్ స్వచ్ఛందంగా రక్త దానం చేశారు. వారు మాపై తుపాకీ గురిపెడతారని మాకు తెలుసు.. మేం కూడా వారికి వ్యతిరేకంగా యుద్ధ కార్యకలాపాలు చేపడతాం. కానీ అన్నింటికీ మించి మానవత్వం ఉంది అని యాదవ్ తెలిపారు. 2006లో 3.25 లక్షల మంది సిబ్బంది కలిగి ఉన్న దేశంలోని అతిపెద్ద పారా మిలటరీ దళంలో చేరిన 36 ఏళ్ల యాదవ్.. తాను గతంలో కూడా రక్తదానం చేశానని చెప్పారు.

యాదవ్ జార్ఖండ్‌లోని దన్బాద్ జిల్లాకు చెందిన వారు. రక్తదానం చేసిన మరో జవాన్ 30 ఏళ్ల సందీప్ కుమార్.. దేశం కోసం కర్తవ్యంలో భాగంగా శత్రువుతో తలపడతాము. అయితే ప్రాణాలు కాపాడడం కూడా మా కర్తవ్యం అని ఆయన అన్నారు. రాజస్థాన్‌లోని జునీజును జిల్లాకు చెందిన కుమార్ 2010లో సీఆర్‌పీఎఫ్ లో చేరారు. గాయపడిన నక్సల్స్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. జార్ఖండ్‌లోని గాయపడిన నక్సల్స్‌కు రక్తదానం చేసిన ఇద్దరు జవాన్ల పట్ల మాకు గర్వంగా ఉందని సీఆర్‌పీఎఫ్ ప్రతినిధి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ మోసెస్ దినకరన్ తెలిపారు. కాగా, ఈ ఆపరేషన్‌లో ఒక మహిళా నక్సలైట్‌తో సహా ముగ్గురు మృతి చెందారు.

Next Story

RELATED STORIES