ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు..

ప్రపంచ ఆరోగ్య సంస్థతో అమెరికా తెగతెంపులు..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని ముంచేస్తుందని తెలిసీ ముందుగా అప్రమత్తం చేయలేదని డబ్ల్యుహెచ్‌వోని తప్పుబడుతున్న ట్రంప్, వైరస్‌కి కారణం చైనానే అని తెలిసి ఆ దేశాన్ని డబ్ల్యుహెచ్‌వో పల్లెత్తు మాట అనకుండా ఉండడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి ఏ మాత్రం మింగుడు పడని అంశంగా మిగిలిపోయింది. దాంతో అవకాశం వచ్చినప్పుడల్లా డబ్ల్యుహెచ్‌వో మీద, చైనా మీద విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ రెండు అంశాలకు తోడు మరికొన్ని కారణాలను చూపుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థతో తాము పూర్తిగా తెగతెంపులు చేసుకుంటున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

ఈ మేరకు శుక్రవారం అర్థరాత్రి శ్వేత సౌధంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ సంస్థకు ఇచ్చే నిధులను ఇతర ప్రపంచ ప్రజారోగ్య సంస్థలకు మళ్లిస్తామని ట్రంప్ అన్నారు. తమ దేశ చట్టాలను గౌరవించని చైనా కంపెనీలపైనా చర్యలు తీసుకుంటామని ట్రంప్ వెల్లడించారు. చైనా పౌరులను ఇక మీదట అమెరికాలో అనుమతించబోమని అన్నారు. హాంకాంగ్‌కు ఇచ్చిన ప్రత్యేక హోదాకు స్వస్తి పలకనున్నామని ఆయన తెలిపారు. గత కొన్నేళ్లుగా అమెరికాను చెైనా కొల్లగొడుతోందని ట్రంప్ ఆరోపించారు.

బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను అక్రమ మార్గాన చైనా మళ్లించుకుందని ఆరోపించారు. అలాగే ఉద్యోగాల్లో సైతం అమెరికా నిబంధనల్ని అతిక్రమించిందని ఆరోపించారు. ఇక వాణిజ్య విషయానికి వస్తే.. ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల్ని పాటించలేదని విమర్శించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం కోసం వెంపర్లాడుతోందని ఆరోపించారు. చైనాతో అమెరికా ఎప్పటికీ నిర్మాణాత్మకబంధాన్నే కోరుకుంటుందని, అందుకోసం దేశ ప్రయోజనాలనైతే ఫణంగా పెట్టలేమని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story