మిడతల బెడద పోవాలంటే.. ఇలా చేస్తేసరి!

మిడతల బెడద పోవాలంటే.. ఇలా చేస్తేసరి!
X

అసలే కరోనాతో విలవిల్లాడుతున్న దేశానికి గోరుచుట్టు మీద రోకటిపోటులా మిడతల బెడద వచ్చి పడింది. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా వీటి గురించి చెబుతారు. ఈ మిడత దండు తాజాగా భారత్‌పై దండెత్తింది. పచ్చని పంటలు కనిపిస్తే చాలు కరకరా కొరికేస్తున్నాయి. వీటి ధాటికి రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అసలీ మిడతలు అంటే ఏంటి? ఏమి తింటాయి? ఎక్కడినుంచి వచ్చాయి? ఎప్పుడు వెళతాయి? అనే ప్రశ్నలు ప్రతిఒక్కరిలోను మెదులుతున్నాయి. మిడత అనేది ఒక కీటకము. వీటిలోనూ రెండు రకాలు ఉంటాయి.. సాధారణ మిడతలు, ఎడారి మిడతలు.. సాధారణ మిడతల జీవితకాలం 10 వారాలు.. ఇవి ఏ దేశంలోనైనా పుడతాయి.. పంట పొలాల్లో కనబడతాయి. అలాగే ఎడారి మిడతల జీవిత కాలం 90 రోజులు.. ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది ఈ ఎడారి మిడతలే.. ముఖ్యంగా అవి రెండుసార్లు గుడ్లు పెడతాయి.

ఆరు వారాల్లో అవి పెరిగి పెద్దవి అవుతాయి. అలా పెరిగి పెద్దవైన మిడతలు నెల రోజుల్లో మళ్లీ గుడ్లు పెడతాయి. మూడు నెలల్లో ఇవి 20 రెట్లు పెరుగుతాయి. ఇవి రోజుకి 150 కిలోమీటర్ల వేగంతో గాలి ఎటు వీస్తే అటు పగలంతా ప్రయాణిస్తాయి. చీకట్లో వీటికి కళ్ళు కనపడవు.. ఇవి ఎవరికి ఎటువంటి హాని చేయవు. అయితే మిడతల దండు అనేది అరుదుగా సంభవించే విపత్తు లాంటిది. వీటి వల్ల పంట పొలాలు సర్వ నాశనమౌతాయి. ఇంకా చెప్పాలి అంటే అసలు అక్కడ పచ్చటి పంట ఉండేదనడానికి ఆనవాళ్లే మిగలవు. కాని ఇవి అతి అరుదుగా కనబడతాయి. ఎడారి మిడతలు కొన్ని లక్షల సంఖ్యలో పొలాలు, చెట్లపై వాలి క్షణాల్లో వాటి ఆకులను తిని ముందుకు సాగుతాయి. అలా అవి ప్రయాణించిన ప్రాంతం అంతా ఒక్క నిముషంలో పచ్చదనం మాయమైపోతుంది.. వీటికి ఫలానా పంటే తినాలన్న నియమమేమీ లేదు.. పచ్చగా కళకళలాడే ఏ పంటైనా వాటికి విందు భోజనమే. ఒక్కో దండులో లక్షల కొద్దీ మిడతలు ఉంటాయి.. ఇవి వాలితే 35వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో ఆరగించేస్తాయి.

యునైటెడ్‌ ‌నేషన్స్ ‌ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రి కల్చర్‌ అసోసియేషన్‌ ‌ప్రకారం ఎడారి మిడతలు వసంత ఋతువులో తూర్పు ఆఫ్రికా దేశాలు అయిన సోమాలియా ఏతోపియా కెన్యా దేశాలలో పుడతాయి.. అక్కడ జీవనం సాగించి సంతానోత్పత్తి కోసం అనువైన ప్రాంతాలను వెతుకుతూ సుడాన్‌..‌ పశ్చిమ ఆఫ్రికా వైపునకు వెళతాయి.. అక్కడినుంచి అరబ్‌ ‌దేశాల గుండా.. ఏషియా దేశాలకి ప్రయాణిస్తూ ఆఫ్గనిస్తాన్‌ ‌పాకిస్తాన్‌ ‌ల మీదుగా భారత్‌ ‌లోకి ప్రవేశిస్తాయి.. నిజానికి ఈ మిడతలు 2018 లోనే ఎక్కువగా రావడం ప్రారంభించాయి. 2018 మే నెలలో దక్షిణ అరేబియాలోని రుబ్‌ అల్‌ ఖలీ ఎడారి గుండా మెకును తుఫాన్‌ చెలరేగింది.. ఆ సమయంలో ఎడారిలో అక్కడక్కడా నీటి చెలమలు ఏర్పడ్డాయి. ఎడారి మిడతలు మనుగడ సాగించడానికి, అలాగే సంతానోత్పత్తిని పెంచుకోవడానికి ఈ చెలమలు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాయి. అలా అదే ఏడాది అక్టోబరులో లుబాన్‌ తుఫాన్‌ రావడంతో కోట్ల సంఖ్యలో పెరిగిపోయాయి.. దాంతో అక్కడి నుంచి మిడతల దండయాత్రను ప్రారంభించాయి. అక్కడినుంచి సౌదీ ప్రయాణించి ఆ తరువాత ఇరాన్‌ గుండా పాకిస్థాన్‌ చేరుకున్నాయి.. గత నెల 11న పాకిస్తాన్‌ ‌దాటుకుంటూ ఈ మిడుతలు రాజస్థాన్‌ ‌ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయి.

దాంతో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో వేలాది హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి.. గత మూడు దశాబ్దాలలో అత్యంత దుర్మార్గపు దాడిగా రైతులు అభివర్ణిస్తున్నారు. ఈ మిడతల ముప్పును నివారించడానికి పరిష్కారం అంటూ ఏది లేదు.. కానీ అవి పంట పొలంలోకి రాకుండా డబ్బాలు, మెటల్‌ ప్లేట్లు, డ్రమ్ములు, రేడియో, లౌడ్‌స్పీకర్‌ వంటి ఎలక్ట్రికల్‌ పరికరాలతో శబ్దం చేస్తే అవి బయపడి పోతాయని, తద్వారా పంటలను రక్షించుకోవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వేప రసాయనాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలి.. అదేవిధంగా క్వినోల్‌ఫాస్‌, క్లోరో ఫైరోపాస్‌ , డీపీ పొడి మందును పంటలపై చల్లాలని చెబుతున్నారు. వీటి తోపాటు పొలం గట్లపై పంట చుట్టూ కలుపు మొక్కలు లేకుండా తీసుకుంటే మిడతల ముప్పును సాధ్యమైనంత వరకూ నివారించవచ్చు.

Next Story

RELATED STORIES