పాక్‌ పావురాన్ని విడిచి పెట్టిన భారత్‌

పాక్‌ పావురాన్ని విడిచి పెట్టిన భారత్‌

గత ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని కథువా జిల్లాలో దొరికిన పాకిస్తాన్ అనుమానిత పావురం ఎటువంటి గూఢచర్యానికి పాల్పడలేదని భారత్ నిర్ధారించింది. అన్నివిధాల పావురాన్ని పరీక్షించిన అనంతరం దానిని ఎలాంటి సీక్రెట్‌ ఆపరేషన్లకి ఉపయోగించలేదని తేలింది. దాంతో ఆ పావురాన్ని పోలీసులు విడిచిపెట్టారు. గత ఆదివారం పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఈ పావురం బోర్డర్‌కు దగ్గరలో ఉన్న గీత దేవి చద్వాల్‌ అనే మహిళ ఇంటిపై వాలింది. అయితే ఆ పావురం కాలికి ఒక రింగ్‌ ఉండటాన్ని గమనించిన గీత వెంటనే దానిని పట్టుకొని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌కు అప్పగించింది. వారు పావురం గురించి స్థానిక హిరా నగర్‌ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. పావురం కాలు మీద ఉంగరం తోపాటు చెక్కబడిన సంఖ్యలు ఉండడంతో కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాదులకు సమాచారం చేరవేయడానికి ఇది వచ్చిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.. అయితే దానిని పరీక్షించిన అనంతరం అటువంటిది ఏది లేదని తేల్చారు పోలీసులు.

పాకిస్తాన్ గ్రామస్తుడు తన పెంపుడు పక్షి అని చెప్పుకునే పావురంలో అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో పావురాన్ని విడిచిపెట్టాము అని జమ్మూ కాశ్మీర్‌లోని సీనియర్ పోలీసు అధికారి శైలేంద్ర మిశ్రా చెప్పారు. పావురం దొరికిన అదే ప్రదేశంలోనే దానిని వదిలివేసినట్టు వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ కు చెందిన పావురం యజమాని హబీబుల్లా శుక్రవారం మాట్లాడారు.. "ఇది కేవలం అమాయక పక్షి" అని, దానిని విడుదల చేయాలని భారతదేశాన్ని కోరారు. అంతేకాదు పావురం రేసింగ్ పోటీలో పాల్గొన్నదని, దాని కాలుపై ఉన్న అంకెలు తన మొబైల్ ఫోన్ నంబర్ అని చెప్పారు. కాగా వదిలివేసిన ఆ పావురం దాని యజమాని వద్దకు తిరిగి చేరిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Tags

Read MoreRead Less
Next Story