రూ. 2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ కోసం గొడవ..

రూ. 2 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ కోసం గొడవ..

బెజవాడ గ్యాంగ్‌వార్‌లో గాయపడ్డ తోట సందీప్‌.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సందీప్‌పై గతంలో సస్పెక్ట్‌ షీట్‌ ఉన్నట్లు తెలిపారు పోలీసులు. సందీప్‌ మృతదేహాన్ని ఇంకా బంధువులకి అప్పగించలేదు ఆసుపత్రి వర్గాలు. దీంతో ఆందోళనకు దిగారు సందీప్‌ అనుచరులు. ఓ భూ వివాదంలో ఈ గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే సందీప్‌పై 13 కేసులు, పండుపై 3 కేసులున్నట్లు వెల్లడించారు. ఇరు వర్గాలను అదుపులో తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు.

యనమలకుదురులో 2 కోట్ల రూపాయల విలువైన భూసెటిల్‌మెంట్‌లో రెండు గ్రూపుల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఓ అపార్ట్‌మెంట్‌ విషయంలో తోట సందీప్ గ్రూపు, మణికంఠ అలియాస్‌ పండు గ్రూపులు గొడవకు దిగాయి. ఇది తీవ్రస్థాయికి చేరడంతో పరస్పరం కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ ఘటనలో గ్యాంగ్ లీడర్లలిద్దరూ గాయపడగా... వీరిని ఆసుపత్రిలో చేర్పించారు వారి అనుచరులు. అయితే సందీప్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ భూసెటిల్‌మెంట్‌ వ్యవహరంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినట్లు తెలుస్తోంది. అపార్ట్‌మెంట్‌ గురించి సెటిల్‌మెంట్ చేసేందుకు సందీప్ ఒప్పుకున్నాడు. ఇదే అపార్ట్‌మెంట్‌ విషయంలో పండు సైతం జోక్యం చేసుకోవడంతో వీరి మధ్య దూరం పెరిగింది. దీంతో ఈ అంశంపై మాట్లాడుకుందామనే నిర్ణయానికి వచ్చారు సందీప్‌, పండు.

పటమటలోని డొంకరోడ్డులో వీరిద్దరూ కలసి మాట్లాడుకుంటుండగా ఉన్నట్టుండి గొడవ మొదలైంది. అప్పటికే వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు. రాళ్లతో దాడులు చేసుకున్నారు. పరస్పరం దాడుల దిగడంతో పటమట ఏరియాలో కలకలం రేగింది. ఈ స్ట్రీట్ ఫైట్‌లో 30 మంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్ వార్‌తో బెజవాడ వాసులను భయాందోళనకు గురయ్యారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు.

Tags

Read MoreRead Less
Next Story