కోట్లకు అధిపతులు ఈ స్టార్ హీరోలు.. వారి తొలి సంపాదన

కోట్లకు అధిపతులు ఈ స్టార్ హీరోలు.. వారి తొలి సంపాదన

ఎవరి కెరీర్ గ్రాఫ్ ఉన్నపళంగా పైకి ఎగబాకదు. దాని వెనుక వారి కష్టం.. కొంత అదృష్టం తోడై వారిని అత్యున్నత స్థానంలో నిలుపుతుంది. మొదట్లో అవకాశాల కోసం చేయి చాస్తే.. అదృష్టం కలిసి వస్తే డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితిలో ఉంటారు. చిత్ర పరిశ్రమ ఎవరికీ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పదు. అయినా పట్టువదలని విక్రమార్కుల్లాగా ఏ చిన్న అవకాశం వచ్చినా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఎప్పటికో సక్సెస్ వరిస్తుంది. అందలం ఎక్కిస్తుంది. కెరీర్ మొదట్లో వారి జీతం వందల్లో ఉంటే.. ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపతులు ఆ అగ్ర హీరోలు.. వారిలో కొందరి గురించి తెలుసుకుందాం. అమితాబచ్చన్, కమల్ హాసన్, అక్షయ్ కుమార్, ఇర్ఫాన్ ఖాన్ తదితరుల ఆస్తి విలువ ఎంతో చూద్దాం.

సినిమాలకు పనికి రావు.. ఆ బొంగురు గొంతుతో ఇంకా కష్టం అని తిరస్కరించారు అమితాబ్‌ని చూసిన దర్శక, నిర్మాతలు. అయినా ఫీలవలేదు అమితాబ్.. తిరస్కరణకు గురైన చోటే ఆదరణ పొందాలనుకున్నారు. తానేంటో నిరూపించుకున్నారు. నెలకు రూ.500 జీతంతో తన కెరీర్‌ని ఆరంభించిన అమితాబ్ ఆస్తి విలువ ప్రస్తుతం రూ.2800 కోట్లు. ఓ షిప్పింగ్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేసిన అమితాబ్ సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సక్సెస్ అయ్యారు.

దక్షిణాదితోపాటు, ఉత్తరాదిలో నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ కమల్ హాసన్. 1960లో బాలనటుడిగా కాలాతూర్ కన్నమ్మ చిత్రంలో సావిత్రికి కొడుకుగా నటించారు. అందులో ఆయన నటించినందుకు రూ.500 పారితోషికం ఇచ్చారు. ఆపై తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో దాదాపు 220 సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.700 కోట్లు.

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్పిన పనిలేదు. సామాజిక స్పృహతో ఆయన తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంటాయి. సంక్షోభ సమయాల్లోనూ అన్నార్తులను ఆదుకునే విషయంలో ముందుంటారు. ఆయన ఆస్తి విలువ రూ.500 కోట్లు. చిత్ర పరిశ్రమకు రాక ముందు బ్యాంకాక్ హోటల్లో చెఫ్‌గా పని చేసేవారట.. అప్పుడు ఆయన జీతం రూ.1500.ఇప్పుడు ఒక్కో సినిమాకు 40 నుంచి 75 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటారట.

అద్భుతమైన కథా చిత్రాలతో అభిమానులను అలరించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇటీవల కన్నుమూశారు. ఆయన మరణం కుటుంబసభ్యులతో పాటు, అభిమానులకూ తీరని లోటు. నటనలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో చిన్న చిన్న పనులు చేసేవారు. అప్పుడు ఆయనకు రూ.25లు ఇచ్చేవారట. ఇప్పుడు ఆయన ఆస్తి విలువ రూ.376 కోట్లు అని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story