ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

స్థానిక అంశాలపై కేంద్రం నిర్ణయాలు తీసుకునే విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. ఒక్కో రాష్ట్ర నైసర్గిక స్వరూపం..ఆయా రాష్ట్రాల అవసరాలు ఒక్కో విధంగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో స్థానికంగా నెలకొన్న పరిస్థితులు, ప్రజల అవసరాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా పాలసీలను రూపొందించుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలన్నది కేసీఆర్ వాదన. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెరమీదకు తీసుకువచ్చిన జాతీయ విద్యుత్‌ పాలసీని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ ద్వారా వెల్లడించారు.

వన్‌ నేషన్‌...వన్‌ రేషన్‌ తరహాలోనే దేశమంతా ఒకే తరహా విద్యుత్‌ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులేస్తున్న కేంద్రం...విద్యుత్‌ ముసాయిదా బిల్లు 2020పై అభిప్రాయాలు చెప్పాలంటూ రాష్ట్రాలను కోరింది. జూన్‌ 5 వరకు గడువు ఇచ్చింది. దీంతో కేంద్రానికి తమ అభిప్రాయాలను తెలుపుతూ లేఖ రాసిన సీఎం కేసీఆర్‌..విద్యుత్‌ ముసాయిదా బిల్లు 2020ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం అమలు చేయాలని అనుకుంటున్న కొత్త విద్యుత్‌ పాలసీలో ఇక సబ్సిడీలు ఉండవ్‌. ఎవరైనా రాష్ట్రాలు సబ్సిడీలు ఇవ్వాలన్నా..లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలి చేయాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని కేసీఆర్‌ ప్రధానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. విద్యుత్‌ రాయితీలను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారానే ఇవ్వాలన్న ప్రతిపాదనకు తెలంగాణ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్‌ ను ఉచితంగా అందిస్తోందని..ఇలాంటి పరిస్థితుల్లో రాయితీ చెల్లింపు విధానాలను రాష్ట్ర ప్రభుత్వాలకే విడిచిపెట్టాలని కూడా కోరారు.

విద్యుత్‌ ముసాయిదా బిల్లు రాష్ట్ర విద్యుత్‌ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. అంతేకాదు..స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హరించటమేనని..ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని లేఖలో ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు కేసీఆర్‌. విద్యుత్‌ నియంత్రణ మండలి నియామకానికి సంబంధించి రాష్ట్రాల అధికారాలను హరించటంతో పాటు.. ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ పేరిట సమాంతర వ్యవస్థను తీసుకురావటం వివాదాలకు దారితీస్తుందన్నారు. రాయితీలు లేకుండా కమిషన్‌ టారిఫ్‌ నిర్ణయించే ప్రతిపాదన వల్ల చివరికి గృహ వినియోగదారులపై కూడా భారం పడుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story