వైద్య విద్యార్థులకు కరోనా.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో..

వైద్య విద్యార్థులకు కరోనా.. ఉస్మానియా మెడికల్ కాలేజీలో..

కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందిపై కరోనా పంజా విసురుతోంది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. మంగళవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో శనివారం నుంచి మంగళవారం సాయింత్రం వరకు మొత్తం బాధితుల సంఖ్య 12కు చేరింది. నిమ్స్‌లో నలుగురు విద్యార్థులకు కరోనా సోకింది. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని పేట్లబురుజు ఆస్పత్రి, ఉస్మానియా, నిలోఫర్, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న విద్యార్థుల్లో కొందరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

గాంధీ ఆస్పత్రిలో కూడా ఒక పీజీ విద్యార్ధికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. ఉస్మానియాలోని హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు, నర్సుకు కరోనా సోకింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో కొత్తగా 99 కేసులు నమోదవగా అందులో ఒక్క జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 70 కేసులు ఉండడం గమనార్హం. ఉస్మానియాలో భోజనం తయారు చేసే ఓ యువకుడికి కూడా వైరస్ సోకడంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎర్రగడ్డ ఆుర్వేద ఆస్పత్రిలో మంగళవారం 24 మందికి, కింగ్‌కోఠిలో 15 మందికి వైరస్ నిర్ధారణ అయింది.

భోలక్‌పూర్‌లోని బడి మసీదు సమీపంలో క్లినిక్ నిర్వహించే ఆర్ఎంపీ (40)కి పాజిటివ్ వచ్చింది. తుకారం గేట్‌లో ఇటీవల ఓ వైద్యుడికి పాజిటివ్ వచ్చింది. బీజేపీ నేత చింతల రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకూ వైరస్ సోకింది. ఆయన తల్లికి, సతీమణి, కుమారుడికి పాజిటివ్ వచ్చింది. వీరంతా ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story