హైదరాబాద్‌ను వణికిస్తోన్న కరోనా.. నగరంలో ఒక్కరోజే 108 పాజిటివ్ కేసులు

హైదరాబాద్‌ను వణికిస్తోన్న కరోనా.. నగరంలో ఒక్కరోజే 108 పాజిటివ్ కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేల 20కి చేరింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 2 వేల 35 కేసులు నమోదయ్యాయి. వలస కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారిలో 448 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మరోవైపు, నగరంలో కొత్త ప్రాంతాలకు కూడా కరోనా విస్తరిస్తోంది. మొన్నటివరకు జియాగూడ, ఆసిఫ్ నగర్, బోలక్ పూర్, కార్వాన్‌ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన కరోనా మహమ్మారి.. తాజాగా నాగోల్ డివిజన్‌లోని బండ్లగూడ, ఫతుల్లాగూడకు కూడా వ్యాపించింది.

బుధవారం నగరంలో కొత్తగా 108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జియాగూడలో ఏడుగురు, యూసఫ్ గూడలో ఇద్దరికి కరోనా సోకింది. ఖైరతాబాద్, ఛాదర్‌ఘాట్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుల్స్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కరోనా సోకి నారాయణగూడ, రామంతాపూర్‌లో ల్యాబ్‌టెక్నియన్స్‌కు వైరస్ సోకింది. అడిక్‌మెట్‌లో 2, రాంనగర్‌లో 2, అల్వాల్‌లో 2 కేసులు నమోదయ్యాయి. దమ్మాయిగూడలో 8 నెలల పాపకు కరోనా పాజిటివ్ రాగా.. కరోనా బారినపడి గోల్నాకలో ఓ మహిళ మృతి చెందింది.

మరోవైపు వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 32 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. నిమ్స్‌లో ఏడుగురు, గాంధీ, నీలోఫర్‌లో ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయ్యింది. అటు నగర శివార్లతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story