Top

భారత సైన్యానికి  భారీ విజయం

భారత సైన్యానికి  భారీ విజయం
X

భారత సైన్యానికి భారీ విజయం లభించింది. పుల్వామా ఉగ్రదాడికి భద్రతా బలగాలు ప్రతీకారం తీర్చుకున్నాయి. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌ ఫౌజీ భాయ్‌ను సైన్యం హత మార్చేసింది. కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఫౌజీ బాయ్‌ను మట్టుబెట్టారు. కంగన్ జిల్లాలో సేఫ్ ప్లేస్‌లో దాక్కున్న ఫౌజీ భాయ్‌ను అక్కడికక్కడే కాల్చి చంపారు. ఫౌజీ బాయ్‌తో పాటు అతని సెక్యూరిటీ గార్డులను కూడా ఎన్‌కౌంటర్ చేశారు. కశ్మీర్ సరిహద్దుల్లో కొన్ని వారాలుగా వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఉగ్రవాదులను ఎక్కడికక్కడే హతమారుస్తున్న సైన్యం, నిఘా వర్గాల సమాచారంతో టాప్ కమాండర్లను నిర్దాక్షిణ్యంగా ఏరిపారేస్తోంది. ఇండియన్ ముజాహిదీన్, జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 75 మంది ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. తాజాగా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఫౌజీ బాయ్‌ గురించి ఐబీ నుంచి ఆర్మీకి సమాచారం వచ్చింది. కంగన్ గ్రామంలోని అస్తన్ మొహల్లాలో ఫౌజీ బాయ్ దాక్కునట్లు నిఘా వర్గాలు వివరాలు అందించాయి. దాంతో కశ్మీర్ పోలీసులు, భారత ఆర్మీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఫౌజీబాయ్ దాక్కున్న ఇంటిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో 2 వర్గాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. చివరికి ఫౌజీ బాయ్‌తో పాటు జాహిద్ మంజూర్ వనీ, మంజూర్ అహ్మద్‌ ఖర్‌ అనే మరో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.

ఫౌజీభాయ్‌... క‌శ్మీర్‌లో ఉగ్రదాడుల‌కు ఇత‌నే కీల‌క వ్యూహాకర్త. పాకిస్థాన్ బోర్డర్‌లో అల్లర్లకు కూడా ఇతనే కారకుడు. జైషే మహ్మద్ మిలటరీ చీఫ్ అబ్దుల్ రౌఫ్ అస్ఘర్‌కు ఇతను క్లోజ్ రిలేటివ్. జైషే కీలక నాయకుడు మసూద్ అజర్ అల్వీకి దగ్గరి బంధువు. ఇతని అసలు పేరు మహమ్మద్ ఇస్మాయిల్ అల్వీ. ఐతే, క‌శ్మీర్ ఇంటెలిజెన్స్ పోలీసుల రికార్డులో చాలా పేర్లున్నాయి. ఫౌజీభాయ్, అబ్దుల్ రెహ్మాన్‌, ఇద్రిస్, హైద‌ర్, లంబూ... ఇలా రకరకాల పేర్లతో కార్యకలాపాలు కొనసాగించాడు. 2018లో పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి అడుగుపెట్టాడు. పుల్వామా పరిససర జిల్లాల్లో మకాం వేసి కశ్మీర్ యువతను రెచ్చగొట్టడం, ఉగ్రవాద కార్యకలాపాలను పెంచడం, టెర్రరిస్ట్ దాడులకు కుట్ర చేయడం ఇతని పని. బాంబుల తయారీలో దిట్ట. ఇతనికి జాహిద్ మంజూర్ వనీ, మంజూర్ అహ్మద్‌ ఖర్‌లను బాడీగార్డు లుగా పెట్టారు. జాహిద్ పుల్వామా జిల్లా కరీమాబాద్ గ్రామానికి చెందినవాడు, మంజూర్ షోపియాన్ జిల్లా సిర్యన్ గ్రామానికి చెందినవాడు. వీరిద్దరు 2017లో జైషే మహమ్మద్‌లో చేరారు. ఈ ముగ్గురి కోసం భద్రతా బలగాలు ఎప్పటి నుంచో వేటాడుతున్నాయి. ఐతే, మారు పేర్లతో ఎప్పటికప్పుడు పోలీసుల నుంచి తప్పించుకునేవాడు. తన ఆపరేషన్స్ కోసం ఎన్‌క్రిప్టెడ్ శాటిలైట్ ఫోన్ మాత్రమే ఉపయోగించేవాడు. మొబైల్ ఫోన్‌ను అస్సలు ఆపరేట్ చేసేవాడు కాదు. నమ్మకమైన కొరియర్ల ద్వారానే ఇన్ఫర్మేషన్ పాస్ చేసేవాడు. చివరికి కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ నేతృత్వంలో సాగిన ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌తో ఫౌజీ బాయ్ గుట్టు బయటపడింది.

కశ్మీర్‌లో ఉగ్రదాడుల్లో ఫౌజీబాయ్ పాత్ర కీలకం. ముఖ్యంగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లాలో జరిగిన మారణకాండకు ప్రధాన వ్యూహకర్త ఫౌజీభాయే. ఆ దుర్ఘటనలో సీఆర్‌పీఎఫ్‌కు చెందిన 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు రేపింది. ఓ దశలో యుద్ధం జరగొచ్చేమో అని వార్తలు కూడా వచ్చాయి. అప్పుడు మొదలైన ఉద్రిక్తతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పుల్వామా జిల్లాలో మరోసారి మారణకాండ సృష్టించడానికి ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయి. కారుబాంబుతో సైనికులను హతమార్చడానికి ప్లాన్ వేశాయి. ఈ కుట్రను ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దాంతో మే 27న పుల్వామాలో శాంట్రో కారును సీజ్ చేశారు. ఆ కారులో 20 కిలోల శక్తివంతమైన ఐఈడీ ఉంది. దాంతో ఆ కారును నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి పేల్చివేశారు. దాంతో జవాన్లకు పెద్ద ముప్పు తప్పిపోయింది. ఈ కారుబాంబు కుట్రలోనూ ఫౌజీ బాయ్‌దే మెయిన్ రోల్.

Next Story

RELATED STORIES