జూన్ తరవాతే సినిమా.. అప్పటి వరకు సైలెన్స్ ప్లీజ్..

జూన్ తరవాతే సినిమా.. అప్పటి వరకు సైలెన్స్ ప్లీజ్..
X

కరోనా వైరస్ గత మూడు నెలలుగా ప్రభుత్వానికి సినిమా చూపిస్తోంది. ఇంక కొత్తగా ఏం సినిమా చూపిస్తారు బాబు.. కాస్త ఆగండి తొందర పడకండి.. అసలే లాక్డౌన్ తరవాత కేసులు పెరుగుతున్నాయని ఆందోళనగా ఉంటే ఇప్పుడు సినిమా గురించి ఏం మాట్లాడాలి. జూన్ నెల కానివ్వండి ఆ తర్వాత చూద్దామంటోంది కేంద్ర ప్రభుత్వం. ఈ విషయమై సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మాట్లాడుతూ.. జూన్ నెలలో నమోదయ్యే కోవిడ్ కేసులను పరిశీలించి అనంతరం సినిమా హాల్ తెరిచే విషయం చెప్తామన్నారు. లాక్డౌన్ కారణంగా చిత్ర రంగం ఎదుర్కొంటున్న సమస్యల గురించి సంస్థ ప్రతినిధులు మంత్రి జావడేకర్‌తో వీడియో సమావేశం ద్వారా చర్చించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 9500 సినిమా హాళ్లలో టిక్కెట్ల అమ్మకం ద్వారా రోజుకు రూ.30 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని.. ఇప్పటి వరకు భారీగా నష్టపోయినా సినీ రంగం సంఘీభావంగా ఉండడాన్ని ఆయన ప్రశంసించారు. చిత్ర రంగం ఎదుర్కుంటున్న పలు సమస్యలపై కూడా సినీ సంఘాల ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే వీటిని నెరవేర్చాలంటే ప్రభుత్వంపై అధిక భారం పడుతుందని, అయినా సంబంధిత శాఖల దృష్టికి తీసుకువస్తానని మంత్రి హామీ ఇచ్చారు.

చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించే విషయమై మంత్రి మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిందన్నారు. అయితే అన్‌లాక్-1లో కొన్నింటిని తెరిచేందుకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం, థియేటర్లు, స్విమ్మింగ్‌పూల్స్, పార్కులు, బార్లు, సమావేశ మందిరాలు వంటి వాటిని తెరిచేందుకు తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు మూసే ఉంచాలని ప్రభుత్వం ప్రకటించింది.

Next Story

RELATED STORIES