మానవత్వానికే మచ్చ.. గర్భంతో ఉన్న ఏనుగును నమ్మించి..

మానవత్వానికే మచ్చ.. గర్భంతో ఉన్న ఏనుగును నమ్మించి..
X

అది మదపుటేనుగు కాదు. ఊళ్లో జనాలను ఏం చేయనూ లేదు. అది చేసిన పాపమల్లా.. మనుషులను నిజంగా మనుషులే అని నమ్మటం. మనిషి రూపంలో కూడా క్రూర మృగాలు ఉంటాయని ఈ ఏనుగు పసిగట్టలేకపోయింది. అంతా మంచివాళ్లే అని అనుకుంది. కొందరు ఉన్మాదుల పైశాచికానందానికి నరకం అనుభవించింది. మనిషి చేసిన గాయానికి తొండం, నోటి నుంచి రక్తం ధారలుగా కారిన ఒక్కరిపై కూడా దాడి చేయలేదు. చివరికి బాధను భరించలేక..ఆహారం తినలేక గర్భంతో ఉన్న ఆ ఏనుగు తనువు చాలించింది.

కేరళాలోని మళప్పురంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఇక్కడి నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. గ్రామంలోని కొందరు వ్యక్తులు పైత్యం నెత్తికెక్కి ఉన్మాదుల్లా చెలరేగిపోయారు. ఆకలితో ఉన్న ఆ ఏనుగుకు పైనాపిల్‌ లో పటాసులు పెట్టి ఆహారంగా ఇచ్చారు. పాపం ఆ ఏనుగు పైనాపిల్‌ను తినబోయింది. దీంతో పటాసులు ఒక్కసారిగా పేలటంతో ఏనుగుకు తీవ్రంగా గాయాలయ్యాయి. నోటి వెంట రక్తం ధారులగా కారింది. గాయం సలుపుతున్నా..ఒక్కరిపై కూడా దాడి చేయకుండా గ్రామం నుంచి వెళ్లిపోయిన ఆ ఏనుగు...ఆ తర్వాత కోలుకోలేకపోయింది. గర్భంతో ఉండటంతో ఆకలి వేస్తున్నా..గాయం సలపటంతో ఏం తినలేకపోయింది. పైగా గాయంపై ఈగలు మూగటంతో ఇక అది నొప్పిని భరించలేకపోయింది. ఉపశమనం కోసం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకుంది.

నదీ ప్రవాహంలో గాయం నుంచి కొంత ఉపశమనంగా అనిపించటంతో ఇక ఆ ఏనుగు నదీలో నుంచి బయటికి రాలేదు. ఈగల బాధ కూడా లేకపోవటంతో నీటిలోనే ఉండిపోయింది. అలా తిండితిప్పలు లేకుండా రోజుల తరబడి నీటిలోనే దిగాలుగా ఉంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఏనుగును రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి గర్భంతో ఉన్న ఏనుగును బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని కాపాడేందుకు ఎంతగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. కానీ, గాయం బాధను ఓర్చుకోలేకనో...ఈ మనుషల మీద ఇక నమ్మకం పోయిందోగానీ గజరాజు నీటి నుంచి అస్సలు బయటికి రాలేదు. చివరికి ఆకలితో అలమటించి కడుపులో బిడ్డతో సహా మే 27న చనిపోయింది.

ఈ ఘటనపై స్పందించిన కేరళ ప్రభుత్వం ఘటనపై కేసు నమోదు చేసింది. గర్భంతో ఉన్న ఏనుగును అతి క్రూరంగా పొట్టనబెట్టుకున్న ఆ క్రూరులను కఠినంగా శిక్షిస్తామని సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ప్రస్తుతం నిందితులు అంతా పరారీలో ఉన్నారని, కిలర్స్‌ ను త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.

పటాసులు పెట్టి నమ్మించి ప్రాణం తీసిన మనుషుల మీద ఆ ఏనుగు ఆగ్రహించలేదు. గ్రామంపై విరుచుపడి బీభత్సం సృష్టించనూ లేదు. కనీసం ఒక్కరికి కూడా గాయం చేయలేదు. బాధను మౌనంగా భరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. మనిషి మృగంగా మారిన వేళ.. మృగం మనిషి కంటే గొప్ప తత్వాన్ని బోధించింది.

Next Story

RELATED STORIES