క్లైమాక్స్‌కు చేరిన లిక్కర్‌ కింగ్ కథ

క్లైమాక్స్‌కు చేరిన లిక్కర్‌ కింగ్ కథ

లిక్కర్ కింగ్ కథ క్లయిమాక్స్‌కు చేరింది. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా.. కటకటాలు లెక్కించే సమయం దగ్గరపడింది. అన్నీ కుదిరితే మరికొద్ది గంటల్లో విజయ్ మాల్యా స్వదేశానికి రానున్నాడు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన ప్రక్రియలన్నీ పూర్తయినట్టు తెలుస్తోంది. తనను భారత్‌కు అప్పగించవద్దంటూ.. మాల్యా చేసిన చివరి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. లండన్ దిగువ కోర్టుతో పాటు.. హైకోర్టు, సుప్రీం కోర్టు కూడా మాల్యా అభ్యర్థనలను తోసిపుచ్చింది. దీంతో మాల్యా అప్పగింతకు లైన్‌క్లియరైంది. విజయ్ మాల్యాను భారత్‌కు తీసుకురావాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న సీబీఐ, ఈడీల ప్రయత్నాలు సఫలం కానున్నాయి.

ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి మాల్యాను నేరుగా ఆర్థర్‌ రోడ్డు జైలుకు తరలిస్తారని తెలుస్తోంది. అక్కడ సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించనున్నారు. అనంతరం మాల్యాను కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు సామాచారం. అలాగే, మాల్యాను తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐతో పాటు ఈడీ.. కోర్టును కోరే అవకాశం వుంది. అయితే, మాల్యా అప్పగింతకు సంబంధించి కేంద్రం నుంచి ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధినేత, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా బ్యాంకుల నుంచి వేలకోట్ల రుణాలు తీసుకుని.. తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోయాడు. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా భారత్ చేయని ప్రయత్నమంటూ లేదు. మల్యా భారతీయ బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టినట్టు ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఆ తర్వాత అప్పులు, ఆర్థిక నష్టాలతో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్ మూతపడింది. ఈ నేపథ్యంలో 2016 మార్చిలో విజయ్ మాల్యా భారత్‌ నుంచి బ్రిటన్‌కు పారిపోయాడు. అప్పటి నుంచి మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత్ ప్రయత్నిస్తూనేవుంది.

మల్యాను భారత్‌కు అప్పగించాలంటూ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ కోర్టు 2018 సెప్టెంబర్‌లో తొలిసారి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను బ్రిటన్ హోంమంత్రి కూడా ఆమోదించారు. అయితే, మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. హైకోర్టును ఆశ్రయించాడు విజయ్ మాల్యా. ఈ నేపథ్యంలో మాల్యా అప్పీల్‌ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత సుప్రీం కోర్టును ఆశ్రయంచగా.. అక్కడ కూడా మాల్యాకు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో విజయ్‌ మాల్యాకు అన్ని దారులు మూసుకుపోయాయి. మాల్యాను భారత్‌కు అప్పగించే ఫైల్‌పై బ్రిటన్ హోంమంత్రి ప్రీతిపటేల్ సంతకం కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో విజయ్‌ మాల్యా భారత్‌కు రావడం లాంఛనంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story