ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ ?

ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి మాజీ క్రికెటర్‌ నవజ్యోత్ సింగ్ ?
X

మాజీ క్రికెటర్‌, పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఆమ్‌ ఆద్మీ పార్టీలోకి జంప్‌ అవుతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సిద్దూ వస్తే సాదరంగా ఆహ్వానిస్తామంటూ తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. ఆప్‌లో చేరేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో సిద్దూ సంప్రదింపులు కూడా జరుపుతున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి.

మొదట బీజేపీలో ఉన్న సిద్దూ.. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ గూటికి వచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత సీఎం అమరీందర్ సింగ్‌తో విభేదాలతో.. ఏడాది క్రితం ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీతో అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందే ఆప్ నుంచి సిద్దూకు ఆఫర్ అందింది. ఈ ఏడాది మార్చిలోనూ ఆమ్ ఆద్మీ పంజాబ్ కన్వీనర్ సిద్దూని పార్టీలోకి ఆహ్వానించారు.

పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సిద్దూ విజయానికి కారణమైన ప్రశాంత్ కిశోర్.. 2020 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పనిచేశారు. ఇప్పుడు ఆయనే.. సిద్దూను ఆప్‌లోకి తీసుకొచ్చేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో పంజాబ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‌ఆద్మీ పంజాబ్‌పై గురి పెట్టింది. ఇందులో భాగంగా సిద్దూను ఎలాగైనా పార్టీలో చేర్పించేలా కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్ననట్లు సమాచారం. అయితే ఈ వార్తలను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ఖండిస్తున్నారు. సిద్దూ కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని.. ఆప్‌లో చేరబోరన్నారు. ప్రశాంత్ కిశోరే ఆ విషయాన్ని తనకు తెలియజేశారని అమరీందర్ సింగ్ చెప్పారు.

Next Story

RELATED STORIES