ఆర్బీఐ మారటోరియం విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఆర్బీఐ మారటోరియం విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

ఆర్బీఐ మారటోరియం విధానంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ మాఫీపై R.B.I విధానంలో స్పష్టత లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆర్బీఐ తీరుపై సంతృప్తి చెందని సుప్రీంకోర్టు, మారటోరియం పీరియడ్‌లో రుణాలపై వడ్డీ మాఫీపై కేంద్ర ఆర్థికమంత్రి అభిప్రాయాన్ని కోరింది. వారంలోపు సంతృప్తి పరిచే స్థాయిలో సమాధానమివ్వాలని కేంద్ర ఆర్థికమంత్రిని ఆదేశించింది. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో R.B.I కీలక నిర్ణయం తీసుకుంది. టర్మ్ లోన్ల చెల్లింపులపై 6నెలల మారటోరియం విధించింది. మార్చ్ ఒకటి నుంచి ఆగస్టు 31 వరకు మారోటరియం ఉంటుందని తెలిపింది. ఆరు నెలల పాటు నెలవారీ చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని, మారటోరియం పీరియడ్ ముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని దశలవారీగా చెల్లించుకోవచ్చని సూచించింది. ఐతే, ఈ 6 నెలలకు గాను టర్మ్ లోన్లపై వడ్డీ మాఫీ ఉండబోదని తెలిపింది. ఈ విధానాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. మారటోరియం పీరియడ్‌లోనూ వడ్డీ వసూలు చేయడం సరైంది కాదని పిటిషనర్లు పేర్కొన్నారు. పైగా, వడ్డీపై వడ్డీ వేస్తున్నారని, ఇది అన్యాయమని వాదించారు. కస్టమర్లకు కచ్చితంగా వడ్డీ మాఫీ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనను R.B.I తోసిపుచ్చింది. వడ్డీ మాఫీ చేస్తే బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని పేర్కొంది. దేశ ఆర్థిక వ్యవస్థ కు 2 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం కలుగుతుందని చెప్పుకొచ్చింది.

ఇక, లాక్ డౌన్ టైమ్‌లో ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగులకు పూర్తి జీతాల చెల్లింపులపైనా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంలో మే 15న ఇచ్చిన ఆదేశాలను జూన్ 12 వరకు పొడిగించింది. లాక్‌డౌన్ పీరియడ్‌లో జీతాలు కట్ చేయవద్దని, అలా చేస్తే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని మార్చ్ 29న కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్క్కులర్‌పై కార్పొరేట్ సంస్ధలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. విచారణ జరిపిన కోర్టు ఉద్యోగులకు పూర్తి జీతాలు ఇవ్వని సంస్ధలపై బలవంతంగా చర్యలు తీసుకునేందుకు రాజ్యాంగపరంగా అవకాశం లేదని మే 15న ఇచ్చిన ఉత్తర్వుల్లో తేల్చిచెప్పింది. లాక్‌డౌన్ టైంలో ఉద్యోగులతో పాటు సంస్ధలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాయని తెలిపింది. ఈ ఆదేశాలపై కేంద్రం మరోసారి సుప్రీం కోర్టును ఆశ్రయించింది. స్పందించిన కోర్టు, మే 15న ఇచ్చిన ఆదేశాలను జూన్ 12 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వడం ఎంత ముఖ్యమో సంస్ధలు ఆర్ధికంగా ఇబ్బందులపాలవ్వకుండా మనుగడ సాగించడం కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది.

మరోవైపు, ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రైవేటు ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలైంది. స్పందించిన కోర్టు, అలా చేయడం సాధ్యమవుతుందా అని ప్రైవేట్ ల్యాబ్ సెంటర్లను ప్రశ్నించింది. కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలని తాము చెప్పడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన రేటుకే చేయాలని చెబుతున్నామని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై అభిప్రాయం చెప్పాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేసిన కోర్టు, తదుపరి విచారణను వాయిదా వేసింది.

Next Story

RELATED STORIES