బంజారాహిల్స్‌లోని ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న సంచలన నిజాలు

బంజారాహిల్స్‌లోని ఏసీబీ దాడుల్లో బయటపడుతున్న సంచలన నిజాలు

మేతకు మరిగిన అవినీతి అధికారులు కరోనా టైంలోనూ కరెన్సీ వేటను వదిలిపెట్టలేదు. అవకాశం ఉన్న ప్రతి చోట డబ్బులు దండుకోవటం అలవాటైన ఆఫీసర్లకు బంజారాహిల్స్‌లోని కోట్ల విలువైన భూమి కాసులు కురిపంచే మార్గాన్ని చూపించింది. కానీ, బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ జరిపిన దాడుల్లో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏకంగా ఇద్దరు అధికారులు బుక్కైపోయారు. బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ నాయక్, షేక్‌పేట్ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ నాగార్జున రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. బంజారాహిల్స్ ఎమ్మార్వో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఇలా అధికారులంతా మూకుమ్మడిగా లంచాలు డిమాండ్ చేసి అడ్డంగా దొరికిపోవడం సంచలనంగా మారింది.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కోట్ల విలువైన స్థల వివాదం విషయంలోనే అధికారులు లంచాలకు కక్కుర్తి పడ్డారు. రోడ్డు నంబర్ 14లోని వివాద స్థలమైన సర్వే నంబర్ 17, 19లో ఖలీద్ అనే వ్యక్తి.. తనకు ఎకరం భూమి ఉందని చెబుతున్నాడు. అయితే తన భూమిని సర్వే చేయాలని షేక్‌పేట్ ఎమ్మార్వోకి ధరఖాస్తు చేసుకున్నాడు. ఎమ్మార్వో ఆ ధరఖాస్తును రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నాగార్జున రెడ్డికి రిఫర్ చేశారు. అయితే.. సర్వే నంబర్ 17, 19లో ప్రభుత్వ భూమి మాత్రమే ఉందని, ఖలీద్ అనే వ్యక్తి ఆ భూమిని కబ్జా చేశాడని షేక్‌పేట్ రెవెన్యూ అధికారులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ ఎస్సై రవీందర్ నాయక్.. ఖలీద్ పై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఖలీద్‌తో డీల్ కుదుర్చుకున్న నాగార్జున రెడ్డి.. భూమి సర్వే చేసి ఇస్తానని తనకు 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డీల్ ఒకే చెప్పిన ఖలీద్ ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇన్‌స్పెక్టర్ నాగార్జున్ రెడ్డికి 15 లక్షలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కూడా ఏసీబీ అధికారులు తనీఖీలు చేశారు. 3 లక్షలు ఇస్తే.. ఈ కేసు నుంచి తప్పిస్తానని ఖలీద్‌ను డిమాండ్ చేశాడు ఎస్సై రవీందర్ నాయక్. అయితే ఖలీద్ లక్ష యాబ్బై వేలు ఇచ్చాడు. కానీ, కేసు నుంచి తప్పించలేదు. దీంతో ఎస్సైపై కూడా బాదితుడు ఏసీబీ కి పిర్యాదు చేశాడు. అలాగే ఈ ల్యాండ్‌కు సంబంధించిన కేసు కోర్టులో కూడా ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇప్పటికే షేక్ పేట్ ఎమ్మార్వో ఇంటిపై కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన పోలీసులు.. ఆమెను విచారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో జరిగిన విచారణకు ఎమ్మార్వో సుజాత హజరయ్యారు. అటు ఆర్‌.ఐ. నాగార్జున రెడ్డి, బంజారాహిల్స్‌ ఎస్సై రవీంద్ర నాయక్‌లను కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏసీబీ విచారణ తర్వాత ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది పాత్ర ఉంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story