ఓ మంచి పనికి 'భావన' శ్రీకారం.. కూచిపూడి కళాకారులకు సాయం

ఓ మంచి పనికి భావన శ్రీకారం.. కూచిపూడి కళాకారులకు సాయం
X

కళ కడుపునింపదని తెలిసినా.. అడుగులు అటువైపే వెళుతుంటాయి. కళాకారుల దాహం తీరనిది. కళ.. కళ కోసమే కాని కాసుల కోసం కాదని ఎంత అనుకున్నా కడుపు నిండాలంటే నాలుగు కాసులు జేబులో ఉండాలి. కరోనా వైరస్ కళాకారుల్ని వీధిన పడేసింది. వలస కూలీల బ్రతుకుల్ని, రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవుల్నీ చూశాము. వారి సరసన కళాకారులనూ చేర్చాల్సిన దౌర్భాగ్యం దాపురించింది. కళలను ప్రోత్సాహిస్తాము.. వారసత్వ సంపదను కాపాడుకుంటాము అని ప్రగల్భాలు పలికే ప్రభుత్వాల మాటలు నీటిమీద రాతలుగా మిగిలిపోతున్నాయి.

కళాకారుల గొంతులో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆదుకునే వారి కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు కళాకారులు. ఒక కళాకారుని బాధ మరొక కళాకారునికి తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో. అందుకే కూచిపూడి నాట్య కళాకారిణి భావన వారి కన్నీళ్లకు కదిలిపోయింది. వారి కష్టాలు తీరే మార్గం కోసం అన్వేషించింది. ఏ ప్రయత్నం అయినా ఒక్క అడుగుతోనే ఆరంభం అని తనే మొదటి అడుగు వేసింది. తనతో పాటు మరో వేయి అడుగులు వేయించే దిశగా ముందుకు సాగుతోంది. ఫేస్ బుక్, వాట్సప్ లలో #savekuchipudiartists అనే ఉద్యమం మొదలు పెట్టింది.

కష్టాల్లో ఉన్న ఆర్టిస్టుల ఇంటర్వ్యూలను పేస్ బుక్ లైవ్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. వాటిని చూసి కూచిపుడి నాట్య గురువు వెంపటి చినసత్యం గారి పెద్దబ్బాయి వెంపటి వెంకట్ భావనకు అండగా నిలిచారు. దేశ విదేశాల్లో ఉన్న వారి చేత నిరుపేద కళాకారులకు సాయం అందేలా చూశారు. సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్‌ కింద కళాకారులకు లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందిస్తోంది. దీంతో ఈ ఉద్యమం మొదలు పెట్టిన 13 రోజుల్లోనే 426 మంది నిరుపేద కళాకారుల వివరాలను భావన సేకరించింది. వీరందరికీ లోపముద్ర చారిటబుల్ ట్రస్ట్‌ నుంచి ఆర్థిక సహాయం అందుతోంది.

ఇంతటి మహోద్యమానికి మరికొంత మంది మహానుభావులు స్వచ్ఛందంగా సాయం చేయటానికి ముందుకు వచ్చారు. సేవాభారతి ఆర్గనైజేషన్ కి చెందిన రామ్మూర్తి కళాకారులకు వైద్య సహాయం, జిందాల్ కంపెనీ వారు 65 ఏళ్లు పైబడిన వృద్ధ కళాకారులకు పెన్షన్ సదుపాయం కల్పించనున్నారు. అంతే కాకుండా ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చిన మరికొంత మంది గురువులు తామూ చేయూతనందిస్తామని మాటిచ్చారు. అయితే.. ఇంకొంతమంది దాతలు ముందుకు వస్తే.. మరెంతోమంది పేద కళాకారులకు సహాయాన్ని అందించినట్లవుతుంది. వాస్తవానికి ప్రభుత్వానికి ఇది చిన్న పనే. సర్కారు సహృదయంతో అర్థం చేసుకుంటే 6నెలలుగా గజ్జెకట్టని కూచిపూడి కళాకారుల గుండె చప్పుడు వారికీ వినిపిస్తే సంతోషం.

ఎందరో మహానుభావులు.. సహాయం చేస్తున్న అందరికీ వందనాలు అని భావన వినమ్రంగా నమస్కరిస్తోంది. ఇకపై ఏ పేద కూచిపుడి కళాకారుడూ పస్తులతో పడుకోకూడదన్నదే తన ఆశయమని ఆదిశగానే తన అడుగులు సాగుతాయని అంటోంది. కళాకారులకు మళ్లీ మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. సహాయం చేయదలచినవారు సంప్రదించవలసిన ఫేస్ బుక్ ఐడి..

భావన. పెదప్రోలు..#savekuchipudiartists. FB id: Save kuchipudi Artists

Next Story

RELATED STORIES