సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్‌..! తొలిదశ‌ సక్సెస్‌

సెప్టెంబర్‌లో కరోనా వ్యాక్సిన్‌..! తొలిదశ‌ సక్సెస్‌

కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తుంది. కంటికి కనిపించని ఈ వైరస్‌ చాపకింది నీరులా విస్తరిస్తుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఎక్కడి వెళ్లాలన్నా, ఎవరితో మాట్లాడాలన్నా మహమ్మారి ఎటునుంచి వచ్చి అంటుకుంటుందో అని అనుమానంతో ఆపసోపాలు పడుతున్నారు. ఈ భయంకరమైన COVID-19 కు వ్యాక్సిన్‌ను కనుగొనటానికి ప్రపంచం మొత్తం రేసులో ఉంది. అయినప్పటికీ, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధనా బృందం తన పోటీదారులందరి కంటే ఒక అడుగు ముందుగానే ఉంది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న COVID-19 వ్యాక్సిన్ మానవులపై పరిశోధన ట్రయల్స్ కొనసాగుతూనే ఉంది. అయితే సెప్టెంబర్‌ కల్లా 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుందని.. అలాగే 2021 జూన్ కల్లా 200 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ అందుబాటులో రానున్నట్టు తయారీ, మార్కెటింగ్‌లో భాగస్వామిగా వ్యవహరిస్తున్న బ్రిటిష్‌ ఫార్మా దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా అధికారికంగా వెల్లడించింది. ఏజెడ్‌డీ 1222 జేఏబీ అనే వ్యాక్సిన్‌ తయారీని ప్రారంభించామని, అన్ని పరీక్షలు ఆగస్టులో విజయవంతంగా పూర్తయ్యే నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వ్యాక్సిన్‌ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ ప్రకటించింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ 18–55 ఏళ్ల మధ్య ఉన్న ఆరోగ్యకరమైన వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించింది. దీంతో తొలిదశ ట్రయల్స్‌ విజయవంతం అయినట్టు ప్రకటించడంతో ప్రజలలో ఆశలు చిగురించాయి. అయితే ప్రస్తుతం మరో దశ ప్రయోగం చేయాల్సి ఉంది. అది కూడా త్వరలోనే నిర్వహించేందుకు సదరు సంస్థ సిద్ధమైంది. ఇందుకు గాను 10,260 మంది వాలంటీర్లను ఎంపిక చేసింది. వారిపై ప్రయోగాలు ఆగస్టు నాటికి సత్ఫలితాలనిస్తే తమ కృషి ఫలించినట్టేనని, వెంటనే వ్యాక్సిన్‌ను మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇదిలావుంటే ఆస్ట్రాజెనెకా ఫార్మా సంస్థ నాలుగు దేశాల్లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. అందులో

ముఖ్యంగా బ్రిటన్‌ తోపాటు భారత్, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీని ప్రారంభించనుంది. అయితే భారత్ లో ఈ వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది.

Tags

Read MoreRead Less
Next Story