అన్‌లాక్ 1.. సందడిగా మారిన షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు

అన్‌లాక్ 1.. సందడిగా మారిన షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు
X

అన్‌లాక్-1 నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మందిరాలు, షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలోని చారిత్రక కట్టడాల్లోని 820 దేవాలయాలు కూడా పున:ప్రారంభ మయ్యాయి. కొవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో ఏర్పాట్లు చేశారు. ప్రజలు కచ్చితంగా మాస్క్‌ ధరించాలి. భౌతికదూరం పాటించాలి. శానిటైజేషన్ చేసు కోవాలి. అవన్నీ పాటిస్తూనే భక్తులు ఆలయాలకు వచ్చారు. ప్రజలు షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు వెళ్లారు.

ఢిల్లీ.. కన్నాట్‌ప్లేస్‌లోని ఆలయంలో భక్తులు సందడి చేశారు. ఓ వ్యక్తి హనుమంతుడి వేషం వేసి అలరించాడు. పంజాబ్-అమృత్‌సర్‌లోని శ్రీకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కర్ణాటక లోని సంగమేశ్వర ఆలయంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ క్యూలో నిల్చొన్నారు. పక్కపక్కనే నిల్చోవడం, తోసుకోవడం లాంటివి లేకుండా సాఫీగా దర్శనం జరిగింది. గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయంలో అధికారుల పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. అమృత్‌సర్‌లోని ప్రఖ్యాత స్వర్ణ దేవాలయం భక్తులతో కిటకిటలాడింది.

కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఆలయాలు తెరుచుకోలేదు. చెన్నైలో ప్రముఖ ఆలయం మొదలుకొని చిన్న గుడిని కూడా తెరవలేదు. ప్రార్థనాస్థలాలను తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో భక్తులను అనుమతించలేదు. తమిళనాడులో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజుకు వెయ్యి నుంచి 2 వేల కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా చెన్నై సిటీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాంతో కొవిడ్ కేసులను అరికట్టడానికి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలోనూ సందడి మొదలైంది. రెండున్నర నెలల పాటు మూతపడిన మాల్స్, రెస్టారెంట్లకు మళ్లీ కస్టమర్లు రాక ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి భయంతో మొదటి రోజు స్పందన ఎక్కువగా లేదు. పరిమిత సంఖ్యలోనే ప్రజలు వస్తున్నారు. ఇక, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లలో కొవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా కుర్చీల మధ్య దూరం పెంచారు.

రెండున్నర నెలలకు పైగా ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. మే రెండో వారం నుంచి సడలింపులు పెరిగాయి. లాక్‌డౌన్-4లో చాలా రంగాలకు అవకాశమిచ్చారు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా మొదలైంది. తాజాగా జూన్ 8 నుంచి ఆలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇవ్వడంతో అవన్నీ మళ్లీ సందడిగా మారాయి.

Next Story

RELATED STORIES