లాక్ డౌన్ ను మళ్లీ కఠినతరం చేస్తారా? మొత్తానికే ఎత్తేస్తారా?

లాక్ డౌన్ ను మళ్లీ కఠినతరం చేస్తారా? మొత్తానికే ఎత్తేస్తారా?

లాక్ డౌన్ ప్రజల జీవన స్థితిగతుల్లో అనూహ్య మార్పులను తీసుకొచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు సాధారణ స్థితి నెలకొల్పేందుకు అన్ లాక్ దశలను అమలు చేస్తూ వస్తున్నాయి ప్రపంచదేశాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకు అనుగుణంగానే ఆన్ లాక్ దశలను అమలు చేస్తోంది. లాక్ డౌన్ 5.Oఅమలులో ఉన్నా..కొన్నింటికి మినహా దాదాపుగా అన్ని రంగాలపై ఆంక్షలు సడిలించారు. ఈ సడలింపులో కరోనాకు కలిసొచ్చింది. మొన్నటి వరకు లాక్ డౌన్ ను వ్యతిరేకించిన నెటిజన్లే..ఇప్పుడు కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.

మూడు నాలుగు రోజులుగా సోషల్ మీడియాలో లాక్ డౌన్ ఆంక్షలపై జోరుగా ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో ప్రచారానికి విశ్వసనీయత లేకున్నా..ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రజల్లోనూ లాక్ డౌన్ పట్ల అభిప్రాయం మారుతోంది. కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. 3 లక్షల మార్క్ దాటి...ప్రపంచంలోనే భారత్ 4వ స్థానానికి చేరుకుంది. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కొద్దిమేర వైరస్ ను అదుపు చేయగలిగినా..ఆ తర్వాత వైరస్ వ్యాప్తి తీవ్రత అమాంతంగా పెరిగింది. మరణాల రేటు కూడా ఆందోళన కలిగిస్తోంది. దీంతో సోషల్ మీడియాలోని ఓ సెక్షన్ లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. కొందరు ఏకంగా హైకోర్టులను కూడా ఆశ్రయించారు. అయితే..ఈ నేపథ్యంలోనే సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తుండటం లాక్ డౌన్ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తోంది. ఈ నెల 16, 17న అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని..కరోనా, లాక్ డౌన్ ఎత్తివేతపై చర్చించనున్నారు. అయితే.. లాక్ డౌన్ కొనసాగింపు యోచనలు మాత్రం లేవని కేంద్రం ఇప్పటికే స్పష్టత ఇచ్చింది.

పెరుగుతున్న కేసులతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. ఢిల్లీలో ఈ నెల 15 నుంచి 31 వరకు పూర్తి లాక్ డౌన్ విధించనున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన కేజ్రివాల్ ప్రభుత్వం..లాక్ డౌన్ పొడిగించే అవకాశమే లేదని స్పష్టం చేసింది. మరోవైపు మహారాష్ట్ర కూడా లాక్ డౌన్ పొడిగించట్లేదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్రలో లక్ష పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చైనాను మించిపోయిన మహారాష్ట్రలో వైరస్ కట్టడికి లాక్ డౌన్ ను పూర్తి స్థాయిలో అమలు చేయనున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మహా ప్రభుత్వం తమ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగించటం లేదంటూ ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు..హైదరాబాద్ లోనూ పూర్తి లాక్ డౌన్ విధించటనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే..మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని తప్పుబట్టారు. హైదరాబాద్ లో పూర్తి లాక్ డౌన్ విధించే ఆలోచనలేవి లేవని క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story