coronavirus : ఓ వైపు గ్రేటర్‌ షేక్.. మరోవైపు ప్రజాప్రతినిధులకు వణుకు..

coronavirus : ఓ వైపు గ్రేటర్‌ షేక్.. మరోవైపు ప్రజాప్రతినిధులకు వణుకు..

తెలంగాణలో కరోనా..హైరానా పెట్టిస్తోంది. ఓ వైపు గ్రేటర్‌ షేక్‌ చేస్తున్న వైరస్‌ మరోవైపు ప్రజాప్రతినిధులకు వణుకు పుట్టిస్తోంది. ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు వైరస్‌ బారిన పడుతున్నారు. నిజామాబాద్ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ కు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా ఆయనకు ఒంట్లో నలతగా అనిపించటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబసభ్యులు క్వారంటైన్‌ లోకి వెళ్లారు. దీంతో తెలంగాణలో కరోనా బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది.

కరోన బారిన పడిన నిజామాబాద్ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌..శనివారం పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల ప్రారంభించి, కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు స్థానిక నేతలు కూడా కార్యక్రమంలో బాజిరెడ్డి వెంట ఉన్నారు. దీంతో వాళ్లందర్ని కూడా క్వారంటైన్‌ తరలించారు. ఇటీవలె జనగామా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు సికింద్రాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రజాప్రతినిధులతో పాటు వారికి సాయంగా ఉండే అధికారులకు, డ్రైవర్లకు కరోనా పాజిటివ్ వస్తుండటంతో నేతలకు కలవరం కలిగిస్తోంది. ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఓఎస్డీకి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. ఇక ఇటీవలె జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ డ్రైవర్‌ కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో బొంతు రమ్మోహన్‌ కు రెండో సారి కరోనా టెస్టులు నిర్వహించారు. పరీక్షల్లో నెగటీవ్‌ రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ ను కరోనా వెంటాడుతోంది. అలాగే మీడియా రంగంలోనూ కరోనా హడలెత్తిస్తోంది. లేటెస్ట్‌ గా హైదరాబాద్ లో 23 మందికి పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది.

Tags

Read MoreRead Less
Next Story