నేడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ

నేడు ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ, రేపు సీఎంలతో సమావేశమవుతారు. మోదీతో మీటింగ్‌కు సంబంధించి ముఖ్యమంత్రులను రెండు గ్రూపులుగా విభజించారు. ఇందుకు సంబంధించి షెడ్యూల్ కూడా రూపొందించారు. ఇవాళ పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ భేటీ అవుతారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో రేపు భేటీ అవుతారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే రోజు మోదీతో సమావేశమవుతారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్‌లో రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, కేసుల కట్టడికి తీసుకుంటున్న చర్యలు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయంపై చర్చలు జరుపనున్నారు. రాష్ట్రాలకు ఆర్థికసాయం, వైద్యపరమైన సదుపాయాలపైనా చర్చించే అవకాశముంది. మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌పై మోదీ స్పష్టత ఇచ్చే అవకాశ ముంది.

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరగుతుండడం కేంద్రాన్ని కలవరపెడుతోంది. జూన్ నెల మొదటి 2 వారాల్లోనే లక్షా పాతికవేలకు పైగా కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులున్నాయి. మిగతా రాష్ట్రాల్లో 5 వేల నుంచి 45 వేల వరకు బాధితులు న్నారు. ఏప్రిల్ నెలాఖరు వరకూ కేసుల పెరుగుదల ఎక్కువగా లేదు. మే, జూన్ నెలల్లో వైరస్ విజృంభించింది. ఇదే సమయంలో లాక్‌డౌన్ సడలించడం, ప్రభుత్వ-ప్రైవేటు కార్యక్రమాలకు అనుమతించడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. ఫలితంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది.

దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి లేదని ఐసీఎంఆర్ చెబుతున్నప్పటికీ బాధితులు, మృతుల సంఖ్య తగ్గకపోవడంపై కేంద్ర ప్రభుత్వం టెన్షన్ పడుతోంది. ఇప్పటికే కరోనా విషయంలో ప్రధాని మోదీ సీఎంలతో చర్చించారు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను కూడా పంపించారు. సెంట్రల్ టీమ్స్ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులపై నివేదికలు రూపొందించాయి. ఆ నివేదికలపై సీఎంలతో మోదీ మాట్లాడే అవకాశముంది. లాక్‌డౌన్ కారణంగా ఆదాయం దెబ్బతిన్నందున ఆర్థికంగా తమను ఆదుకోవాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Next Story

RELATED STORIES