సూర్యాపేటకు కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం..

సూర్యాపేటకు కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివదేహం..

భారత్‌ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్‌ సంతోష్‌ బాబు పార్థివ దేహం మరికొద్దిసేపట్లో సూర్యాపేట చేరుకోనుంది.. ఆయన పార్థివ దేహాన్ని ఆర్మీ ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌పోర్టుకు తరలించింది.. అక్కడ్నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలిస్తున్నారు అధికారులు.. ఉదయం 9గంటలలోపు సంతోష్‌ పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకోనుంది.. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సన్నిహితుల చివరిచూపు తర్వాత అంత్యక్రియలు జరుగుతాయి. హిందూ శ్మాశన వాటికలో సంతోష్‌ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. అధికారిక లాంచనాలతో సంతోష్‌ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆర్మీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంతోష్‌ మరణ వార్తతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. పుట్టింటివాళ్లు, మెట్టినింటివాళ్లు విషాదంలో మునిగిపోయారు. కల్నల్ మరణవార్త విని అతని అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. దేశసేవలో తమ బిడ్డ అమరుడయ్యాడంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు.

భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో మృతిచెందిన జవాన్లలో కల్నల్ బిక్కుమల్ల సంతోష్‌ కూడా ఉన్నారు. కల్నల్‌ సంతోష్‌ సూర్యాపేటకు చెందిన వ్యక్తి. ఉపేందర్ దంపతులకు ఒక్కగానొక్క కొడుకు. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన సంతోష్ ఆ తర్వాత సైన్యంలో చేరారు. ఆర్మీలో అంచెలంచెలుగా ఎదిగి కల్నల్ స్థాయికి చేరుకున్నారు. ఏడాదిన్నర కాలంగా బోర్డర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి లద్ధాఖ్ ప్రాంతంలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. గాల్వన్ లోయలో బోర్డర్‌ను క్రాస్ చేయడానికి చైనా జవాన్లు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. ఈ ప్రయత్నాలను భారత సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుంది. చైనా సైనికులను నిలువరించడానికి కల్నల్ సంతోష్ వీరోచితంగా పోరాడారు. ఆ పోరాటంలోనే తన ప్రాణాలను దేశమాతకు అర్పించారు. సంతోష్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తల్లిదండ్రులు సూర్యాపేటలోని విద్యానగర్‌లో ఉంటున్నారు. భార్యా పిల్లలు ఢిల్లీలో నివాసం ఉంటున్నారు.

కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కార్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీష్ రెడ్డిని ఆదేశించారు సీఎం కేసీఆర్‌.

భారత్‌, చైనా సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన కల్నల్‌ సంతోష్‌ కుటుంబాన్ని.. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరామర్శించారు. సూర్యాపేటలో సంతోష్‌ నివాసానికి వెళ్లిన నారాయణ... తల్లిదండ్రులను ఓదార్చారు. దేశం ఓ గొప్ప యోధుణ్ని కోల్పోయిందన్నారు. అతి పిన్న వయసులోనే ఆర్మీలో ఉన్నత స్థాయికి ఎదిగిన సంతోష్‌.. ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని నారాయణ అన్నారు.

సంతోష్‌ బాబు పార్థివదేహం రానున్న నేపథ్యంలో ఆయన స్వగ్రామానికి అభిమానులు, సన్నిహితులు, ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు.. కడసారి చూపుకోసం తరలివస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story